Tirupati tiruchanuru : ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శ్రీ అలమేలుమంగమ్మ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా కొనసాగుతున్నాయి.ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శంఖుచక్రాలతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.

Tirupati tiruchanuru : ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శ్రీ అలమేలుమంగమ్మ

Tiruchanuru Sri Padmavathi Ammavaru (1)

Updated On : December 2, 2021 / 10:24 AM IST

Tirupati tiruchanuru : శ్రీవారి ఇల్లాలు..తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా కొనసాగుతున్నాయి. తిరుమల ఏడు కొండలపై శ్రీవారు కొలువుంటే కొండకింత తిరుచానురులో శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై పూజలందుకుంటున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు మూడవ రోజున గురువారం (డిసెంబర్ 2,2021) ఉదయం ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శంఖుచక్రాలతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.

కోవిడ్-19 కేసులు తగ్గినా నిబంధనల ప్రకారమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు.

అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసుదన్, ఏవిఎస్వో శ్రీ వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.