Tirumala Anna Prasadam Menu : తిరుమల అన్నప్రసాదం మెనూలోకి కొత్త ఐటమ్.. ఏంటో తెలుసా..
రథసప్తమి రోజు నుంచి పూర్తి స్థాయిలో భక్తులందరికీ అన్నప్రసాదంతో పాటు వడ్డించనున్నారు.

Tirumala Anna Prasadam Menu : తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై అన్నప్రసాదంతో పాటు మసాలా వడ వడ్డించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అన్న ప్రసాదంలో అన్నం, వెజిటబుల్ కర్రీ, సాంబార్, రసం, కొబ్బరి చట్నీ, మజ్జిగా, చక్కెర పొంగలి వడ్డిస్తున్నారు. ఇకపై వీటితో పాటు అన్నప్రసాదం మెనూలో మసాలా వడను చేర్చనున్నారు.
ప్రయోగాత్మకంగా సోమవారం అన్నప్రసాదంతో పాటు 5వేల మంది భక్తులకు మసాలా వడ తయారు చేసి వడ్డించారు. రథసప్తమి రోజు నుంచి పూర్తి స్థాయిలో భక్తులందరికీ అన్నప్రసాదంతో పాటు వడ వడ్డించనున్నారు.
ముందుగా 5వేల వడలు తయారు చేసి ట్రయల్ రన్ పద్ధతిలో అన్నప్రసాద భవనంలో భక్తులకు వడ్డించారు. టీటీడీ ఛైర్మన్ ఆదేశాల మేరకు అన్నప్రసాదం భవనంలో త్వరలోనే భక్తులందరికి కూడా వడలు(గారెలు) సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీ తయారు చేసే ఈ వడలో తెల్ల గడ్డలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఉండవని స్పష్టం చేసింది.
సాధారణంగా అయితే మసాలా వడల్లో ఈ పదార్ధాలను అధికంగా వాడతారు. అయితే, అవి లేకుండానే భక్తులకు వడలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. నిన్న ట్రయల్ రన్ కింద దాదాపు 5వేల గారెలు తయారు చేశారు.