Nara Lokesh: ఫ్యూచర్ లీడర్‌గా లోకేశ్‌కు తెలుగు తమ్ముళ్ల ఎలివేషన్.. బాబు వార్నింగ్ ఇచ్చినా టీడీపీ నేతలు ఎందుకు తగ్గట్లేదు?
కూటమి ప్రభుత్వంలో పవన్ నెంబర్ టు హోదాలో ఉన్నట్లు భావిస్తుండటం వల్లే ..సమస్య వచ్చి పడిందంటున్నారు.

Nara Lokesh
కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అని ఒకరు..డిప్యూటీ సీఎంగా చిన్నబాబు అని మరికొందరు..ఇలా టీడీపీ నేతలు ఎవరికి వారుగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా లోకేశ్ బాబే సీఎం అని బిగ్ సౌండ్ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది..సైకిల్ పార్టీ భవిష్యత్‌లో మళ్లీ పవర్‌లోకి వస్తే సీఎం అయ్యేది లోకేశేనని అందరికీ క్లారిటీ ఉంది. అయితే ఉన్నట్లుండి తెలుగు తమ్ముళ్లు వాయిస్ పెంచడం వెనుక ఉన్న వ్యూహమేంటన్నది ఆసక్తికరంగా మారింది.
టీడీపీ సోషల్ మీడియాలో లోకేశ్ డిప్యూటీ సీఎం అంటూ వారం రోజులుగా హోరెత్తించారు. వరుస పెట్టి పలువురు నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తూ వస్తున్నారు. టీడీపీ లీడర్ల ఎలివేషన్‌పై జనసేన నుంచి రియాక్షన్ వచ్చింది. పవన్ సీఎం కావాలంటూ కోరుకుంటున్నామంటున్నారు గ్లాస్ పార్టీ నేతలు. ఇది అటు ఇటు తిరిగి కూటమిలో కుంపటి అంటూ ప్రచారం మొదలైంది. అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం.. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి విషయంలో ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు హుకుం జారీ చేసింది.
పార్టీ ఆర్డర్స్ ఇచ్చిన చిన్న గ్యాప్‌లోనే చిన్నబాబు, చంద్రబాబు ముందే బిగ్ సౌండ్ చేశారు మంత్రి టీజీ భారత్. స్విట్జర్లాండ్ జ్యూరిచ్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో..ఏపీకి కాబోయే సీఎం నారా లోకేశేనని..ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జరిగేది ఇదేనని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు ముందే టీజీ భారత్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో జోష్‌ను నింపాయి. లోకేశే సీఎం అంటూ మాట్లాడిన టీజీ భరత్‌ను చంద్రబాబు మందలించినట్లు వార్తలు వస్తున్నాయి.
కొన్నిరోజులుగా యాగీ
టీడీపీ నేతలు చిన్నబాబుగా పిలుచుకునే నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ.. కొన్నిరోజులుగా యాగీ జరుగుతోంది. 2014-19 మధ్య పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పట్లో చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంలుగా ఉన్నప్పుడు..వయోవృద్ధుడైన కేఈని తప్పించి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని..కొందరు నేతలు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఆ తర్వాత.. కేటీఆర్‌తో పోల్చుతూ..వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చి..చంద్రబాబు తర్వాత లోకేశ్‌కే పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్‌ను కూడా తెరమీదికి తెచ్చారు తెలుగు తమ్ముళ్లు.
పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా..తెలుగు తమ్ముళ్లు ఇదే డిమాండ్‌ను వినిపిస్తూ వస్తున్నారు. అయితే..అప్పటికి..ఇప్పటికి తేడా పవన్ కల్యాణ్. అప్పట్లో పవన్ మాదిరిగా.. మరో నాయకుడు చంద్రబాబు తర్వాత ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం చేయలేదు. కానీ, ఇప్పుడు పవన్ ఉన్నాడన్న సంకేతాలను జనసేన వర్గాలు ప్రజల్లోకి పంపుతున్నాయి. బాబు తర్వాత పవనే సీఎం అన్నట్లుగా జనసైనికులు, పవన్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. దాంతో కూటమిలో పదవుల పంచాయితీ మొదలైందన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
వాస్తవానికి చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది లోకేశేనని తెలుగు తమ్ముళ్లు ఫిక్స్ అయ్యారు. 2019కి ముందు లోకేశ్‌ను పెద్దగా పట్టించుకోని టీడీపీ నేతలు..ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పనిచేసిన తీరు..ఓడిన మంగళగిరిలోనే మళ్ళీ గెలిచి నిలబెట్టుకునే ప్రయత్నం చూసి..చిన్నబాబే ఫ్యూచర్ లీడర్ అంటూ గళమెత్తుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో పవన్ నెంబర్ టు హోదాలో ఉన్నట్లు భావిస్తుండటం వల్లే ..సమస్య వచ్చి పడిందంటున్నారు.
తెలుగు తమ్ముళ్ల కామెంట్స్ వెనుక స్ట్రాటజీ
చంద్రబాబుకు ఇప్పటికే 75 ఏళ్లు వచ్చాయి. అయినా ఇప్పటికీ ఎనర్జిటిక్‌గానే పనిచేస్తున్నారాయన. అయితే చంద్రబాబు తర్వాత లోకేశే పార్టీ సారధి అని.. కాబోయే సీఎం అని ఎలివేట్ చేసుకునే పనిలో పడింది టీడీపీ. అయితే తెలుగు తమ్ముళ్ల కామెంట్స్ వెనుక ఏదో స్ట్రాటజీ ఉందని..లేకపోతే ఉన్నట్లుండి లోకేశ్ డిప్యూటీ సీఎం అని కొందరు..సీఎం అని మరికొందరు ఎందుకు స్టేట్‌మెంట్లు ఇస్తారంటూ కూడా ఇంకో చర్చ జరుగుతోంది.
ప్రతి విషయంలో పవన్ స్పందిస్తున్న తీరు..ఆయన దూకుడు..బీజేపీతో సేనాని సాన్నిహిత్యం, చంద్రబాబు తర్వాత ఇక పవనే లీడర్ అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం కొందరు కట్టర్ టీడీపీ లీడర్లకు ఏ మాత్రం మింగుడు పడటం లేదట. అందుకే ఫ్యూచర్ లీడర్ లోకేశ్ అని..కాబోయే ముఖ్యమంత్రి చిన్నబాబే అని కామెంట్స్ చేస్తున్నారట. అయితే భవిష్యత్‌లో లోకేశ్ పొలిటికల్‌గా ఏ రోల్ ప్లే చేయబోతున్నారో తెలియదు కానీ..తెలుగు తమ్ముళ్ల కామెంట్స్ మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి. టీడీపీ, కూటమి ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.
Kannappa : తెలుగులో కన్నప్ప ప్రమోషన్స్ లేవా? ప్రెస్ మీట్స్ పెట్టరా? ఎందుకంటే?