TTD Vigilance : తిరుమలలో కొత్త తరహాలో దళారుల మోసం.. దీక్షితులు, అవధాని పేర్లతో..
తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. కొత్త తరహాలో మోసాలకు తెరలేపారు. అమాయక భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు.

Tirumala Devotees Ok
TTD Vigilance : తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. కొత్త తరహాలో మోసాలకు తెరలేపారు. అమాయక భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా భక్తులను మోసగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.(TTD Vigilance)
టీటీడీలో అర్చకులుగా పని చేస్తున్నట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ లో నకిలీ ఖాతాలు సృష్టించి భక్తులను మోసం చేస్తున్న కొంపెల్ల హరినాగ సాయి కార్తీక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొల్లపల్లి శ్రీనివాస దీక్షితులు, సత్య నారాయణ అవధాని పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించాడు కార్తీక్. శ్రీవారి అభిషేకం, తోమాల, అర్చన, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తానని సోషల్ మీడియా ద్వారా నమ్మిస్తాడు. గూగూల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బు వసూలు చేస్తున్నాడు.
నకిలీ ఖాతాలతో కార్తీక్ చేస్తున్న మోసాలను టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదుతో దళారి హరినాగ సాయి కార్తీక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ సీవీఎస్వో గోపీనాధ్ జెట్టి కోరారు. టీటీడీ వెబ్ సైట్ లోనే శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు ఆయన సూచించారు.
తిరుమలకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దళారులు.. వీరిని టార్గెట్ చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కల్పించే పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. దర్శనం టోకెన్లు ఇప్పిస్తామని భక్తులకు ఆశ కల్పించి మోసగిస్తున్నారు. అమాయక భక్తుల నుంచి వేల రూపాయలు దోచుకుంటున్నారు. తీరా తాము మోసపోయామని తెలుసుకుని భక్తులు లబోదిబోమంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భక్తులు అలర్ట్ గా ఉండాలని, దళారుల చేతిలో చిక్కొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దళారుల మాయమాటలకు మోసపోవద్దని కోరారు.
Tirumala Devotees : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. రెండేళ్ల తర్వాత ఇదే..
కాగా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. గోవింద నామస్మరణంతో మారుమోగుతోంది. కరోనా కారణంగా టీటీడీ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరస్ అదుపులోకి వస్తుండడంతో టీటీడీ నిబంధనలు ఎత్తివేసింది. దీంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వీకెండ్ లో ఈ రష్ ఎక్కువగా ఉంటోంది. దీంతో అలపిరి దగ్గర వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
శ్రీవేంకటేశ్వర స్వామిని శనివారం రికార్డు స్థాయిలో 75వేల 775 మంది భక్తులు దర్శించుకున్నారు. రెండేళ్ల తర్వాత అంటే 2020 మార్చి 17వ తేదీ తర్వాత ఈ స్థాయిలో ఇంతమంది భక్తులు దర్శించుకోవడం ఇదే తొలిసారి. టీటీడీ దర్శన టోకెన్లు పెంచడం, సెలవురోజు కావడంతో ఆదివారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అలిపిరి వద్ద శనివారం మధ్యాహ్నానికే 6వేల వాహనాల తనిఖీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల కొండపై గదుల కొరత పెరిగింది.
Dharmashastra : పురుషుడు ఎలా ఉండాలో… దర్మశాస్త్రం ఏం చెప్పింది?
మరోవైపు… తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 13 నుంచి ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై విహరించారు. రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారు మాడ వీధుల ప్రదక్షిణంగా ఊరేగనున్నారు. చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 13, 14న జరగాల్సిన వర్చువల్ ఆర్జిత సేవ… సహస్ర దీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. మార్చి 17తో సాలకట్ల తెప్పోత్సవాలు ముగియనున్నాయి.