ఆ ఎమ్మెల్యేల పనితీరు భేష్.. చంద్రబాబు ప్రశంసలు.. తమ రూటే సెపరేటు అంటూ నిత్యం ప్రజల్లో ఆ ఇద్దరు నేతలు

వివిధ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వందల మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్‌లు చేయించారు.

ఆ ఎమ్మెల్యేల పనితీరు భేష్.. చంద్రబాబు ప్రశంసలు.. తమ రూటే సెపరేటు అంటూ నిత్యం ప్రజల్లో ఆ ఇద్దరు నేతలు

Updated On : June 19, 2025 / 8:20 PM IST

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పనితీరు పొలిటికల్‌ ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారారు. అందరూ వేరు ఆ ఇద్దరు వేరు అనేలా వాళ్ల వర్కింగ్‌ స్టైల్ ఉందట. మాట తీరు నుంచి పనులు చేసి పెట్టే వరకు ప్రతీ విషయంలోనూ..అందరితో ప్రశంసలు పొందుతున్నారట. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శైలే వేరు. ఇటీవల ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వార్తల్లో నిలిచారు.

ఆ తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు స్కూటీ మీద తిరుగుతూ వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ పేరుతో MSME పార్కుకు శంకుస్థాపన చేశారు. ఆ 60 రోజుల్లో రూ.41 కోట్లతో 339 రకాల అభివృద్ధి పనులు పూర్తి చేసి..ఒకేసారిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించిన తీరు చర్చకు దారి తీస్తోంది. మామూలుగా అయితే సీఎం చంద్రబాబు ఎవరినీ అంత తొందరగా మెచ్చుకోరు. కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని డెవలప్‌మెంట్‌కు కేరాఫ్‌గా మారుస్తున్నారని కోటంరెడ్డిని కొనియాడారు చంద్రబాబు.

ఇక అదే నెల్లూరు జిల్లాకు చెందిన కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాలిటిక్స్‌కు కొత్త. అయినా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారట. తన పనితీరుతో అటు నియోజకవర్గ ప్రజల్లోనూ..సొంత పార్టీలోనూ శభాష్ అనిపించుకుంటున్నారట. అన్ని విషయాల్లోనూ తన రూటే సెపరేటు అంటూ అడుగులు వేస్తూ ప్రజల్లోనూ..సొంత పార్టీలోనూ అసంతృప్తి లేకుండా జాగ్రత్త పడుతున్నారట. మరోవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైసీపీ నాయకులపై విరుచుకుపడుతూనే.. తన నియోజకవర్గంలో అక్రమార్కుల తాట తీసేందుకు కూడా వెనుకాడటం లేదట కోవూరు ఎమ్మెల్యే. ఆమె పనితీరుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఫిదా అయ్యారట.

Also Read: బనకచర్లపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ మధ్యలో బీజేపీ.. ఏం జరుగుతోంది?

గత ఎన్నికల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఢీకొట్టి బంపర్ మెజార్టీతో గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. దశాబ్దాలుగా నల్లపురెడ్ల వంశానికి కంచుకోటగా ఉన్న కోవూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా పనితీరులోనూ తన మార్క్‌ చూపిస్తున్నారట. ఓట్లు అడిగేటప్పుడు ఒకలా..గెలిచిన తర్వాత మరోలా..ఉండను.

వర్గవిభేదాలకు అవకాశం లేకుండా..
ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తా.. అంటూ నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల వాగ్ధానాలను నెరవేరుస్తున్నారని టాక్. అంతేకాదు వైసీపీ మాజీ నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వంపై చేసే విమర్శలకు కూడా తనదైన శైలిలో ఎప్పటికప్పుడు సరిగ్గా కౌంటర్లు ఇచ్చేస్తున్నారట ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

ప్రజల సమస్యలను పరిష్కరిస్తూనే..ముందు నుంచి టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వర్గంతో పాటు వైసీపీ నుంచి తనతో వచ్చిన నాయకులందరినీ కూడా కలుపుకుని సొంత పార్టీలో వర్గవిభేదాలకు అవకాశం లేకుండా ముందుకెళ్తున్నారట. పదవుల భర్తీ విషయంలో కూడా ఎలాంటి కాంట్రవర్సీకి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. మరోవైపు కోవూరు నియోజకవర్గంలో దాదాపు వైసీపీని ఖాళీ చేయించి టీడీపీని బలోపేతం చేశారట ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే కొన్నిచోట్ల తన సొంత నిధులతో రోడ్లు, కాలువ పూడికతీతలు, వాటర్ ట్యాంకులు, కొన్ని స్థానిక సమస్యలను పరిష్కరించారట. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున జాబ్‌ మేళా పెట్టి..వివిధ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. వందల మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్‌లు చేయించారు.

వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ఇలా ప్రతీ విషయంలోనూ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పని తీరు భేషుగ్గా ఉందట. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు..ఇటీవల ఎమ్మెల్యేలు, మంత్రులతో జరిపిన టెలీ కాన్ఫరెన్స్‌లో చెప్పుకొచ్చారట. సీఎం దగ్గరే..మంచి మార్కులు కొట్టేయడంతో అటు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్గీయులు, ఇటు కోటంరెడ్డి అనుచరులు ఫుల్‌ ఖుషిగా ఉన్నారట. భవిష్యత్‌లో ఈ ఇద్దరి పనితీరు ఇలాగే కొనసాగుతుందో లేదో..తిరిగి తమ సీట్లను నిలబెట్టుకుంటారా లేదా అన్నది చూడాలి మరి.