Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రౌండప్ అయిపోయారా? మట్టి తవ్వకాలపై విజిలెన్స్‌ దర్యాప్తుతో గుబులు

వంశీ చేసిన కామెంట్స్‌పై యాక్షన్‌ ఉంటుందని లోకేశ్‌ చెప్పకనే చెప్పారంటున్నారు టీడీపీ నేతలు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రౌండప్ అయిపోయారా? మట్టి తవ్వకాలపై విజిలెన్స్‌ దర్యాప్తుతో గుబులు

Vallabhaneni Vamsi

Updated On : November 19, 2024 / 9:52 PM IST

హడావుడి అవసరం లేదు. హంగామా అంత కన్నా వద్దు. అందరి బొక్కలు బయటికి వస్తాయ్‌. విచారణల్లో వాస్తవాలు వెలుగులోకి రాబోతున్నాయ్. టైమ్‌ చూసి ఒక్కొక్కరిని ఆధారాలను సహా మూసేద్దామని పక్కా ప్లాన్‌ను ఇంప్లిమెంట్‌ చేస్తుంది కూటమి సర్కార్. కొడాలి నాని చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తుండగానే..వల్లభనేని వంశీని పక్కాగా ఫ్రేమ్ చేసే ప్లాన్ నడుస్తోన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్‌గా అసెంబ్లీ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర చేసిన కామెంట్స్‌తో వంశీని భయం వెంటాడుతోంది. మైలవరంలో మట్టి తవ్వకాలపై..గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని..త్వరలోనే చర్యలు ఉంటాయని మంత్రి కొల్లు రవీంద్ర బాంబ్ పేల్చేశారు. సీఐడీ విచారణకు కూడా ఆదేశిస్తామని చెప్పారు.

గత ప్రభుత్వంలో మట్టి, గ్రావెల్‌ తవ్వకాల్లో దోపిడీ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వల్లభనేని వంశీ ప్రమేయం ఉందన్న అలిగేషన్స్‌తో విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. ఇప్పటికే 179 మందిపై కేసులు నమోదు కాగా..రూ.90.38 కోట్ల రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వంశీకి ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. విజిలెన్స్ రిపోర్ట్‌ రాగానే సీఐడీకి అప్పగిస్తారని..ఆ తర్వాత మట్టి తవ్వకాలపై వంశీ మీద కేసు నమోదుతో పాటు అరెస్ట్ వరకు వ్యవహారం వెళ్తుందన్న టాక్ వినిపిస్తోంది.

మరోవైపు గన్నవరంలో నియోజకవర్గంలో వంశీ ముఖ్య అనుచరులుగా ఉన్న ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు. టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై అటాక్‌ కేసు A1గా ఉన్న వల్లభనేని వంశీని కూడా అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

డిసెంబర్‌లో విచారణకు హాజరు?
ఇప్పటికే కోర్టు వాయిదాలకు తప్ప గన్నవరం రావడం లేదు వంశీ. త్వరలో ఆయన మరో కోర్టు వాయిదాకు రావాల్సి ఉందట. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో డిసెంబర్‌లో విచారణకు హాజరు అవుతారని తెలుస్తోంది. ఈ లోపు ఆయనపై మరిన్ని కేసులు నమోదయ్యే చాన్స్ ఉందంటున్నారు. ఓవైపు గన్నవరం టీడీపీ నేతపై దాడి కేసు..ఇంకోవైపు మట్టి తవ్వకాలపై విజిలెన్స్ విచారణ.. ఇలా వరుస పెట్టి వంశీని కేసులు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది.

వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్రస్థాయిలో మాట్లాడిన నేతల లిస్ట్‌లో కొడాలి నాని తర్వాత వంశీ కూటమి ప్రభుత్వ టార్గెట్‌లో ఉన్నారు. అంతేకాదు నారా భువనేశ్వరి విషయంలోనూ కామెంట్స్ చేసి తర్వాత సారీ చెప్పారు వంశీ. ఈ వ్యవహారంలోనూ వంశీపై త్వరలో కేసులు నమోదయ్యే చాన్స్ లేకపోలేదు. తన తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా అంటూ..ఈ మధ్యే మండలిలో మంత్రి లోకేశ్‌ చేసిన కామెంట్స్‌ ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి.

వంశీ చేసిన కామెంట్స్‌పై యాక్షన్‌ ఉంటుందని లోకేశ్‌ చెప్పకనే చెప్పారంటున్నారు టీడీపీ నేతలు. అందుకే మండలి వేదికగా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. భువనేశ్వరి మీద వంశీ కామెంట్స్‌ చేయడం అప్పట్లో తీవ్ర దుమారం లేపింది. అప్పటి నుంచే టీడీపీ క్యాడర్ వంశీ మీద మండిపడుతోంది. టీడీపీ పెద్దలు, మంత్రి లోకేశ్‌ కూడా వంశీ విషయంలో సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీపై వరుస కేసులు..అరెస్టు పర్వం ఉంటుందన్న టాక్ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

KCR: కాళేశ్వరంపై మళ్లీ విచారణ.. కేసీఆర్‌కు పిలుపు వస్తుందా? ముందు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేస్తారా?