Andhra Pradesh : రహస్య ప్రదేశంలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల విచారణ

Andhra Pradesh : పన్ను ఎగవేతదారుల నుంచి డబ్బు తీసుకుని వారికి జరిమానా విధించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు తేలింది.

Commercial Tax Employees : కమర్షియల్ ట్యాక్స్ (వాణిజ్య పన్నుల శాఖ) ఉద్యోగులను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు విజయవాడ పోలీసులు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారు అనే ఫిర్యాదు మేరకు నలుగురు కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ లావాదేవీలపై స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపిన తర్వాత విజయవాడ మొదటి డివిజన్ స్టేట్ ట్యాక్స్ ఆఫీస్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

విజయవాడ మొదటి డివిజిన్ స్టేట్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ విభాగ కార్యాలయంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతర అధికారులు, డీలర్లు, మరికొందరితో కలిసి కుట్ర పన్నినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

సమన్ల రూపంలో తప్పుడు రికార్డులు సృష్టించి, పంపిణీ రిజిస్ట్రర్ లలో తప్పులు నమోదు చేసినట్లు, స్వప్రయోజనాల కోసం దాడులు చేస్తున్నట్లు గుర్తించారు. ఈఎస్ఐ, నీరు చెట్టు వంటి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం వెరిఫికేషన్ కోసం ఆడిటర్లను పిలిచి, ఆ ఫైళ్లను మూసివేయడానికి భారీ మొత్తంలో డిమాండ్ చేసినట్లు గుర్తించారు. పన్ను ఎగవేతదారుల నుంచి డబ్బు తీసుకుని వారికి జరిమానా విధించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు తేలింది.

Also Read..Andhra Pradesh : విజయవాడలో కలకలం.. ఆ నలుగురు ఉద్యోగులు అరెస్ట్, ఆందోళనలో కుటుంబసభ్యులు

15 ప్రత్యేక బృందాలతో వివిధ ప్రాంతాల్లో అక్రమ అధికారులను అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో పని చేస్తున్న జీఎస్టీ అధికారి మెహర్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ సంధ్య, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ చలపతి, విజయవాడ-1 డివిజన్‌ కార్యాలయంలో అటెండర్‌(ఆఫీస్ సబార్డినేట్) సత్యనారాయణను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన వారిలో మెహర్‌కుమార్‌ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి. మిగిలిన వారు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘంలో సభ్యులు. నిందితులను విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వాణిజ్య పన్నుల శాఖలోని నలుగురు ఉద్యోగులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఉద్యోగుల అరెస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.

Also Read..Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్ లో వరుస ప్రమాదాలు.. ఘాట్ రోడ్ల విషయంలో టీటీడీ ఏం చేయాల్సి ఉంది!

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అరెస్ట్ పై ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు, గవర్నర్ ను కలిసినందుకు ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ అరెస్టులు అని మండిపడ్డారు. ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. అరెస్టులు, సస్పెన్షన్లకు భయపడేది లేదని.. మా డబ్బులు మాకు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు