Vizag: స్పృహలోకి వచ్చిన వెంటనే తల్లి ఎక్కడ అని సైగలతో తండ్రిని అడిగిన దీపిక.. మరణ వార్తను తండ్రి చెప్పలేకపోయి..
నవీన్ కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించి, శ్రీకాకుళం సమీపంలో పట్టుకున్నారు.

విశాఖలోని స్వయంకృషి నగర్‌లో దీపిక అనే అమ్మాయితో పాటు ఆమె తల్లి లక్ష్మిపై ఓ ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. దీపికకు తీవ్రగాయాలై చికిత్స పొందుతోంది.
దీపిక ఇవాళ స్పృహలోకి వచ్చింది. గొంతుపై తీవ్ర గాయం కావడంతో 6 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో దీపిక ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉంది. స్పృహలోకి వచ్చిన వెంటనే తన తల్లి ఎక్కడ అని సైగల ద్వారా తండ్రిని దీపిక అడిగింది.
Also Read: ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. కంచ గచ్చిబౌలిలో వెంటనే పనులు ఆపేయాలి.. అంతేకాదు..
ఆ పరిస్థితిలో తల్లి మరణవార్తను ఆమెకు తండ్రి చెప్పలేకపోయారు. మరోవైపు తల్లి లక్ష్మి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. మృతదేహన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు.
లక్ష్మి, దీపికపై దాడి చేసిన నిందితుడి పేరు నవీన్. అతడు కత్తి దాడిలో లక్ష్మి కాళ్లు, నడుము, పొట్ట, చేతులు, మెడపై కత్తి గాట్లు పెట్టాడు. ప్లాన్ ప్రకారమే దీపిక తల్లి లక్ష్మినే నవీన్ టార్గెట్ చేశాడు.దీపిక డిగ్రీ చదువుకుని కొంత కాలంగా ఇంట్లోనే ఉంటోంది.
ఆమెను నవీన్ ప్రేమించి, ఈ దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి అనంతరం పారిపోయాడు. దీంతో నవీన్ కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించి, శ్రీకాకుళం సమీపంలో పట్టుకున్నారు.