HCU Issue: ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. కంచ గచ్చిబౌలిలో వెంటనే పనులు ఆపేయాలి.. అంతేకాదు..

ఈ ప్రశ్నలకు సీఎస్‌ జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ సర్కారు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.

HCU Issue: ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. కంచ గచ్చిబౌలిలో వెంటనే పనులు ఆపేయాలి.. అంతేకాదు..

Supreme Court orders on HCU deforestation

Updated On : April 3, 2025 / 5:14 PM IST

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన వేళ ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కంచ గచ్చిబౌలిలోని భూముల విషయంలో తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలు సరికాదని స్పష్టం చేసింది.

ఈ విషయంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రభుత్వం ఆ చర్యలు నిలిపివేయాలని చెప్పింది. ఆ భూముల విషయంలో రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ పంపిన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది.

Also Read: వావ్‌.. షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది బాసూ.. లాంచ్‌ ఆఫర్లతో తక్కువ ధరకు..

దీనిపై జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.  ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. భూముల గురించి వచ్చిన వార్తా కథనాలను అమికస్‌ క్యూరీ సుప్రీంకోర్టుకు తెలిపింది. భూముల వ్యవహారం కేసులో తెలంగాణ సీఎస్‌ను సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది.

భూముల విషయంలో అత్యవసర నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ భూములు అటవీ ప్రాంతంలో ఉన్నా, లేకపోయినా సరే అక్కడి చెట్లను కొట్టేసే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా? అని అడిగింది.

ఒకే ఒక్క రోజులో అంత పెద్ద మొత్తంలో చెట్లు కొట్టేయడం ఏంటని నిలదీసింది. ఈ ప్రశ్నలకు సీఎస్‌ జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ సర్కారు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. పర్యావరణానికి భంగం కలిగేలా చట్టాన్ని మీ చెతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15న నియమించిన కమిటీలోని అధికారులు కూడా సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది.

అది వన్యప్రాణులు ఉండే ప్రదేశమని, నెమళ్లు, జింకలు, పక్షులు ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. పర్యావరణ ప్రభావ సర్టిఫికెట్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

హెచ్‌సీయూలో భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆ భూములు సర్కారువేనని ప్రభుత్వం వాదన. యూనివర్సిటీ భూములను కాపాడాలంటూ, భవిష్యత్ తరాలకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకోవద్దంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పలు వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు దక్కింది.