Sai Supriya Case : విజయనగరం గృహనిర్బంధం వ్యవహారంలో మరో ట్విస్ట్
విజయనగరం గృహనిర్బంధం వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటపడింది. లాయర్లు గోదావరి మధుబాబు, గోదావరి దుర్గాప్రసాద్ ఇంటి ముందు సాయి సుప్రియ తోడికోడలు పుష్పలత ఆందోళనకు దిగింది.

Sai Supriya Case : విజయనగరం గృహనిర్బంధం వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటపడింది. లాయర్లు గోదావరి మధుబాబు, గోదావరి దుర్గాప్రసాద్ ఇంటి ముందు సాయి సుప్రియ తోడికోడలు పుష్పలత ఆందోళనకు దిగింది. తన పెద్ద కుమారుడిని తనతో పంపించాలని డిమాండ్ చేసింది.
దుర్గాప్రసాద్ తో తనకు 2012లో వివాహం అయిందన్న వెంకట పుష్పలత తననూ గృహ నిర్బంధంలో పెట్టారని ఆరోపించారు. దీంతో దుర్గాప్రసాద్ ను వదిలి వెళ్లినట్లు చెప్పింది. దుర్గాప్రసాద్ నుంచి విడిపోయాక తన పెద్ద కుమారుడిని పంపించలేదంది. ఇప్పుడు తన పెద్ద కుమారుడిని పంపించాలని డిమాండ్ చేస్తోంది పుష్పలత.
లాయర్లు దుర్గాప్రసాద్, మధు బాబుల దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సాయి సుప్రియకు 14ఏళ్ల గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ఇప్పుడు ఆమె తోడి కోడలు కూడా ఆందోళనకు దిగింది. తాను కూడా అలాంటి కష్టాలే అనుభవించానని వాపోయింది. అత్తింట్లో తన పెద్ద కుమారుడిని తనకు అప్పగించాలని పుష్పలత డిమాండ్ చేస్తున్నారు. అత్తింటి ముందు ఆమె ఆందోళనకు దిగింది. పుష్పలత ఓ డాక్టర్. ఆమె డెంటిస్ట్ గా పని చేస్తోంది. న్యాయవాది మధుబాబు, అతడి సోదరుడు దుర్గా ప్రసాద్.. ఇద్దరూ కూడా తమ భార్యలను టార్చర్ పెట్టారు. బయటకు వెళ్లనివ్వకుండా చీకటి గదిలో బంధించారు. వారిని హింసించారు.
2012లో పుష్పలత వివాహం జరిగింది. వేధింపులు తాళలేక 2016లోనే ఆమె తన భర్త నుంచి విడిపోయారు. ఆ సమయంలో తన పెద్ద బాబుని గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్తింట్లో విడిచి పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పటివరకు తన తోడికోడలు సాయి సుప్రియ ఆ ఇంట్లో ఉందన్న భరోసాతో తన పెద్ద కొడుకుని అక్కడే వదిలానని, ఇప్పడు ఆమె బయటకు వెళ్లడంతో తన కొడుక్కి దిక్కు ఎవరని ఆమె వాపోయింది.
తన కొడుకుని తనకు అప్పగించాలని అత్తింటి ముందు నిరసనకు దిగింది. ఒక పక్క పెద్ద తోడి కోడలు సాయి సుప్రియ, మరో పక్క చిన్న తోడికోడలు పుష్పలత తాము పడ్డ వేధింపులను బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు కానీ, అటు న్యాయస్థానం కానీ.. ఆ ఇద్దరు లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది.
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకు విజయనగరం పట్టణానికి చెందిన లాయర్ మధుబాబుతో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. న్యాయవాది మధుబాబు తన తల్లి, తమ్ముడి మాటలు విని కట్టుకున్న భార్యను బయటి ప్రపంచానికి దూరం చేశాడు. ఏకంగా 14ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించాడు. ఎప్పుడూ బయటకు తీసుకొచ్చేవాడు కాదు. పిల్లలను కూడా తల్లి దగ్గరకు వెళ్లనివ్వలేదు. తన తల్లితోనే పిల్లల ఆలనా పాలనా చూపించే వాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు 14ఏళ్లు నరకం చూపించాడు. చివరికి సాయి సుప్రియ పుట్టింటి వారు పోలీసులను, కోర్టుని ఆశ్రయించి సాయి సుప్రియకు విముక్తి కల్పించారు.