Vizianagaram Train Accident : రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
గాయపడ్డ వారికి వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారని, వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు. Vizianagaram Train Accident

Vizianagaram Train Accident
Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50వేల చొప్పున సాయం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.
మరోవైపు రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి ఫోన్ చేశారు. రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు సీఎం జగన్. సహాయ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపించామని, గాయపడ్డ వారికి వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు ఏపీ సీఎం జగన్.
Also Read : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
ఘటనాస్థలానికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపించామని, స్థానిక కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని సీఎం జగన్ కేంద్రమంత్రికి వెల్లడించారు. గాయపడ్డ వారికి వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారని, వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు.
విజయనగరం జిల్లాలో ఆదివారం (అక్టోబర్ 29) రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖ రాయగడ ప్యాసింజర్‌ను వెనుక నుంచి పలాస-విశాఖ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నల్ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది. దీంతో పలాస ప్యాసింజర్ కు సంబంధించి 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఘటనా స్థలంలో కరెంటు లేక చీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని విశాఖ, విజయవాడ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read : ఘోర రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి