Viral Video : ఇదేందయ్యా ఇది.. చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు, వీడియో వైరల్.. లీటర్ వెయ్యి రూపాయలు..!

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరుని చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video : ఇదేందయ్యా ఇది.. చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు, వీడియో వైరల్.. లీటర్ వెయ్యి రూపాయలు..!

Water From Tree

Viral Video : జలధారలు ధరణి నుంచి ఉప్పొంగుతాయి. జలపాతాల నుంచి జారిపడతాయి. ఇది కామన్. ఇందులో వింతేమీ లేదు. కానీ, ఇందుకు భిన్నంగా చెట్టు నుంచి నీరు ఉబికి రావడం ఎక్కడైనా చూశారా? పోనీ, కనీసం విన్నారా? లేదు కదూ.. కానీ, అక్కడ అదే జరిగింది. ఓ చెట్టు నుంచి నీరు వచ్చింది. మామూలుగా రాలేదు. ఉబికి మరీ వచ్చింది. చెట్టు నుంచి నీరు విరజిమ్మింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. చెట్టు కాండమే కుళాయిలా మారిపోయింది.

చెట్టు నుంచి నీరు ఉబికి వచ్చిన అద్భుత వింత ఘటన అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోని పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక చెట్టు మొదలు నరుకుతున్న కొద్దీ నీళ్లు ఉప్పొంగి వస్తున్నాయి.

ఒక్కో చెట్టులో 20 లీటర్ల నీరు..
కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంప్ పరిశీలనకు కొందరు ఫారెస్ట్ అధికారులు వెళ్లారు. అక్కడ వారికి ఓ పెద్ద నల్లమద్ది చెట్టు కనిపించింది. అందులో నుంచి చుక్కలు చుక్కలుగా నీరు రావడం గమనించి ఆశ్చర్యపోయారు. దీంతో వారు చెట్టు కాడను మరికాస్త నరకగా అందులోంచి నీరు ఉబికి వచ్చాయి. నల్లమద్ది చెట్టు నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరుని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇదెక్కడి వింతరా మావా అని నోరెళ్లబెడుతున్నారు.

ఈ చెట్టు నీటి ధర లీటర్ వెయ్యి రూపాయలు..!
పాపికొండల ఆటవీ ప్రాంతంలో కనిపించిన ఈ నల్లమద్ది జలధార వృక్షం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇది నిజంగా అద్భుతం అంటున్నారు. కాగా.. నల్లమద్ది చెట్టుకు సుమారు 20లీటర్ల వరకు తనలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అడవిలో తాగునీరు దొరకని సమయంలో నల్లమద్ది చెట్టు ఇచ్చే నీరుతో దాహం తీర్చుకునే అవకాశం ఉంటుంది. చెట్టుకు ఏర్పడిన కణితికి రంధ్రం చేసి దాని నుండి వచ్చిన నీటిని తాగొచ్చని చెప్పారు. కాగా… ఈ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని నమ్ముతారు. ఆ కారణంగా ఈ చెట్టు నీటిని లీటర్ వెయ్యి రూపాయల వరకు అమ్ముతారు.

Also Read : ఎయిర్‌పోర్ట్‌లో ఈ అమ్మాయి ఎలాంటి రీల్స్ తీసుకుందో చూడండి.. లక్షల్లో ఫైన్ వేయాలని డిమాండ్