ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అంటే ఏంటి? దీనిపై రచ్చ దేనికి? ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అంటే ఏంటి? దీనిపై రచ్చ దేనికి? ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు

CM Jagan

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు మరో పదిరోజుల గడువు కూడా లేదు. సాధారణంగా ఇలాంటి తరుణంలో అధికార, ప్రతిపక్షాల మధ్య అనేకానేక అంశాలపై హోరాహోరీ మాటల యుద్ధం జరుగుతుంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్కటే ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రమైపోయింది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రానున్న రోజుల్లో అతిపెద్ద సంస్కరణగా ఎలా నిలవబోతోందో సీఎం జగన్‌ ప్రచార సభల్లో పదే పదే వివరిస్తున్నారు. భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు ఎల్లవేళలా ఉండేలా చేయాలన్న సమున్నత లక్ష్యంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుచేస్తున్నామని, ప్రతిపక్షాలు పనికట్టుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విషప్రచారం చేస్తున్నాయనేది సీఎం జగన్ వెర్షన్..

ఏళ్ల తరబడి కోర్టుల్లో విచారణ
భూముల వివాదాల్లో కోర్టులకు వెళ్లిన వాళ్లలో ఓడినవారు కోర్టుల్లో ఏడిస్తే.. కేసు గెలిచిన వారు కోర్టుల బయట ఏడుస్తారనేది ఓ నానుడి. భూ వివాదాల్లో ఏళ్ల తరబడి కోర్టుల్లో సాగే విచారణ… అందుకు అయ్యే వ్యయం.. చివరకు ఫలితం తేలేనాటికి మారిపోయే పరిస్థితులను ఈ నానుడి ఒక్క వాక్యంలో వివరిస్తుంది. అసలిలా కోర్టుకు వెళ్లే అవసరమే లేకుండా… భూముల వివాదాలన్నింటినీ పరిష్కరించి.. భూమిపై శాశ్వత హక్కు కల్పించడం… వివాదంలో ఉన్న వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించడం… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఉద్దేశం.

ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములుతో పాటు.. ఇంకా అనేక రకాల పేర్లుతో భూములు ఉన్నాయి. వాటన్నింటికీ 30కిపైగా రికార్డులు ఉన్నాయి. అయితే ఇవన్నీ బ్రిటిష్ కాలానికి సంబంధించిన రికార్డులు. ఆ రికార్డుల్లో అనేక అవకతవకలుండడం, సరైనవి లేకపోవడంతో ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా…. ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలన్నా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వివాదంలో ఉన్న భూముల కోసం పోరాడుతున్న వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉంది.

ఇప్పుడున్న భూ రికార్డులే కొనసాగితే?
ఇప్పుడున్న భూ రికార్డులే కొనసాగితే… తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరకదు. వారసత్వంగానూ వివాదాల్లో ఉన్న భూములనే అప్పగించాల్సిన దుస్థితి. అందుకే సమగ్ర సర్వే నిర్వహించి…. అసలైన యజమానులెవరో తేల్చి… వారికి ఆ భూమిపై శాశ్వత హక్కు కల్పిస్తారు. వివాదంలో లేని భూములకు సంబంధించి ప్రజలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తారు. ఇలా అన్ని రకాలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతిపెద్ద భూ సంస్కరణగా నిలవబోతోంది.

నిజానికి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు.. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. వివాదంలో ఉన్న ఆస్తులయితే.. వాటి హక్కుల కోసం కొన్ని కుటుంబాలు తరతరాలుగా కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తుంటాయి. కొందరి జీవితకాలం మొత్తం ఆ పోరాటంలోనే గడిచిపోతుంది. దీనికంతటికీ కారణం ఎప్పుడో వందల ఏళ్ల క్రితం ఆంగ్లేయులు చేపట్టిన భూ సర్వే ఆధారంగానే రికార్డులుండడం… ఆ రికార్డుల్లో తప్పులుండడం.

స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా… ఇంకా ఆంగ్లేయుల సర్వేమీదే ఆధారపడాల్సిన దుస్థితి ఏంటి..? ఆ తప్పులకు అనేకమంది జీవితాలను మొత్తం పణంగా పెట్టాల్సిన అవసరం ఏంటి.? అందుకే భూ సమగ్రసర్వేకు ఏపీలో సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సర్వే పూర్తయితే.. దాని ఆధారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిస్థాయిలో అమలవుతుంది. భూమికి శాశ్వత హక్కు లభిస్తుంది. వివాదంలో ఉన్న భూమికి పరిష్కారం దొరుకుతుంది.

బృహత్తర ప్రయోజనాలు
ప్రజల భూముల భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించడం, ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండడం.. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ వల్ల అందరికీ కలగబోయే బృహత్తర ప్రయోజనాలు. ప్రస్తుతం ఏపీలో ముసాయిదా చట్టం అమల్లో ఉంది. గ్రామాల్లో భూముల రీ సర్వే జరుగుతోంది. ఈ రీ సర్వే జరుగుతున్న తీరును సర్వే ఆఫ్ ఇండియా ప్రశంసించింది. చిన్నచిన్న వివాదాలను మొబైల్ న్యాయస్థానాల్లో పరిష్కరిస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 17వేల గ్రామాలున్నాయి. రెండేళ్ల క్రితం ఈ రీ సర్వే మొదలు కాగా, ఇప్పటికి 4వేల గ్రామాల్లో పూర్తయింది. ఇంకా రెండు వేల గ్రామాల్లో సర్వే తుదిదశకు చేరింది. ఇంకా 11వేల గ్రామాల్లో రీసర్వే మొదలు కావాల్సి ఉంది. మొత్తం అన్ని గ్రామాల్లో రీ సర్వే పూర్తయ్యాక..ముందుగా ఎలాంటి వివాదం లేని భూముల యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందుతాయి. వివాదాలన్నీ తేల్చిన తర్వాతే యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందించడం ద్వారా ఇకపై భూ యజమానులు ఎవరూ కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయనుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.

ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?
ఏపీ ఎన్నికల వేళ ఇంత హాట్ టాపిక్‌ గా మారిన  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు తెరపైకి ఎలా వచ్చింది.. .ఇది అమలుచేయాలన్నది ఎవరి ఆలోచన..? రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి…ఈ యాక్ట్‌పై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు….?  ఎలాగూ అధికారంలోకి రాబోమన్న ధీమాతోనే చంద్రబాబు.. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పెడతానని చెప్పడం ద్వారా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారా..?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ, జనసేన నానా రాద్ధాంతం చేస్తున్నాయి కానీ…అసలు ఈ చట్టం తెచ్చిందే… ఆ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు నీతి అయోగ్ మార్గదర్శకాలు అందిస్తే మూడేళ్ల క్రితం కేంద్రం ఆమోదించింది. ఆ తరువాత ఈ చట్టాన్ని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో  ముసాయిదా చట్టాన్ని రూపొందించి.. భూముల రీసర్వే చేపట్టింది. అన్ని రాష్ట్రాలూ అమలుచేస్తేనే.. ఏపీలోనూ ఈ చట్టాన్ని అమలుచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయినా సరే ప్రతిపక్షాలు  దుష్ప్రచారం చేస్తున్నాయి.

అనుమానాలు అవసరం లేదు: నిపుణులు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అపోహలు, అనుమానాలు అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఏపీలో భూములకు గ్యారంటీ లభిస్తుందని, భూముల రక్షణతో కొనుగోళ్లు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రాష్ట్రాభివృద్ధికి అతి గొప్ప సంస్కరణగా ఇది నిలుస్తుందని భావిస్తున్నారు.

శాశ్వత హక్కుతో లభించే టైటిల్ ద్వారా కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ప్రజలకు తప్పుతుంది. ప్రస్తుతం తమ పేరు మీద భూమి ఉన్నవారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నమోదు చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. భూములకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అర్హులకే అందే వీలు ఈ యాక్ట్ వల్ల కలుగుతుంది.

భూముల హక్కులు, వివాదాల పరిష్కారం కోసం వీఆర్వో, ఆర్ ఐ, తహసీల్దార్, సివిల్ కోర్టులు, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్, సివిల్ కోర్టుల చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  విధానం వల్ల వీళ్లందరి స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక్కరే ఉంటారు. తర్వాత అప్పిలేట్ అధికారి, హైకోర్టు తదుపరి పరిష్కార మార్గాలుగా ఉంటాయి.

అంటే ఓ వివాదం.. వీలయినంత వేగంగా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదసలు మనకు  ఏమాత్రం తెలియనిది. ఒక చిన్న స్థల వివాదం తీరాలంటేనే మనం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ దుస్థితి పోయి… వీలయినంత వేగంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

కేంద్రం ఉద్దేశం?

దేశంలో అన్ని రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్  యాక్ట్ అమల్లోకి తీసుకురావాలన్నది కేంద్రం ఉద్దేశం. కేంద్రం ఉద్దేశం అమలయితే దేశవ్యాప్తంగా ఒకే టైటిల్ రిజిస్టర్ అమలుచేయొచ్చు. అంటే ఒకే రిజిస్టర్‌లో దేశంలోని అన్ని భూముల వివరాలు ఉంటాయి. దీనివల్ల ఏ భూమి ఎవరిదో తెలిసిపోతుంది. ఆక్రమణలకు అవకాశం ఉండదు.

పారదర్శకంగా దేశంలో ఎక్కడైనా, ఎవరైనా భూములు కొనుగోలు చేయొచ్చు.. అమ్మకాలు సాగించవవచ్చు. దేశంలో ఎక్కడ భూమి కొనుగోలుచేసినా.. అందుబాటులో ఉన్న ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టవచ్చు. భూ క్రయవిక్రయాలు, రుణాల వివరాలూ  పారదర్శకంగా ఉంటాయి కాబట్టి..ఇప్పటి తరహాలో ఒకే భూమిని అనేకమందికి విక్రయించడం, ఒకే భూమిని అనేక సంస్థల దగ్గర, బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి అప్పులు తీసుకోవడం వంటి ఆర్థిక నేరాలకు ఆస్కారముండదు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన కేంద్రంలోని ప్రభుత్వాలకు ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు. 1989లోనే ప్రణాళికా సంఘం ఈ చట్టం అమలుకు సిఫార్సు చేసింది. 2008, 2011, 2015, 2019లో నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వాలు ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపాయి. 2019లో నీతి అయోగ్ కొత్త ముసాయిదా పంపింది.