మాజీ మంత్రి కాకాణిపై అక్రమ మైనింగ్ కేసు.. ఇప్పటికే ఏసీబీ కేసుతో రోజా, రజినీకి టెన్షన్.. వీరికి కేసుల భయం
ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసి..కూటమి నేతల టార్గెట్‌గా విమర్శలు చేసిన లీడర్లను వరుస కేసులు వెంటాడుతున్నాయి.

Kakani Govardhan Reddy
ఆయన వెటకారం మామూలుగా ఉండదు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేరు ఎత్తితే చాలు ఒంటి కాలిపై లేస్తారు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక..పార్టీ తరఫున అపోజిషన్ వాయిస్ వినిపిస్తోన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మైనింగ్ మరకలు అంటుతున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు పెట్టారు పోలీసులు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. కేసు ఫైల్ అయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్‌ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.
ఈ గని లీజు కాలం ముగిశాక కూడా..వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని..అంతేకాక రాళ్ళను పేల్చేందుకు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని పెద్ద ఇష్యూ అయింది. ఈ విషయంపై అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మైన్ దగ్గరే నిరసన దీక్ష చేపట్టారు. పేలుడుకు వాడే జిలేటెన్ స్టిక్స్‌తో పాటు పేలుడు పదార్థాలను అధికారులకు అప్పగించారు.
అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా స్పందన లేదని..కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దాంతో వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్పట్లో కేంద్రం ఆదేశించింది. అప్పటి నుంచి గనిలో మైనింగ్ యాక్టివిటీ తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..ఈ అక్రమ మైనింగ్‌పై మరోసారి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణ జరిపి ఏడుగురిపై కేసులు నమోదు చేసింది. ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరును చేర్చారు పోలీసులు.
కాకాణి మైనింగ్ దందాపై సోమిరెడ్డి ఫిర్యాదులు
కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య ఎప్పటినుంచో రాజకీయ వైరం ఉంది. ఈ ఇద్దరి మధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలోనే కాకాణి మైనింగ్ దందాపై సోమిరెడ్డి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండటం.. కాకాణి కూడా సర్కార్‌పై గళమెత్తుతుండటంతో ఆయన దూకుడుకు బ్రేకులు వేసే ప్లాన్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కాకాణికి కూడా ఉచ్చు బిగిసినట్లే అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు వైసీపీ నేతలు కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడంతో క్వారీ కహానీలో త్వరలోనే అసలు ఎపిసోడ్ స్టార్ట్ కాబోతోందన్న టాక్ అయితే వినిపిస్తోంది.
నిన్న గాక మొన్నే మాజీ మంత్రి విడదల రజిని మీద ఏసీబీ కేసు నమోదు అయింది. ఓ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో..గుంటూరు అప్పటి ఎస్పీతో పాటు సీఐ, విడదల మరిది గోపి, ఆమె పీఏతో పాటు విడదల రజినిపై కూడా ఏసీబీ FIR కట్టింది. ఇక మాజీ మంత్రి కొడాలి నాని ఎపిసోడ్ అయితే లైమ్‌లైట్‌లోనే ఉంటూ వస్తోంది. ఆయన అనుచరులను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక పలు ఆరోపణల విషయంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా టార్గెట్‌గా ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రామ్‌కు సంబంధించి ఏసీబీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్‌గా అటవీ భూముల ఆక్రమణలపై దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసి..కూటమి నేతల టార్గెట్‌గా విమర్శలు చేసిన లీడర్లను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోసాని కృష్ణమురళి రిలీజ్ కావడంతో..ఏ క్షణంలో ఎవరి అరెస్ట్ ఉంటుందోనని వైసీపీ శిబిరంలో టెన్షన్ కనిపిస్తోంది. అరెస్టుల ఎపిసోడ్‌లో నెక్స్ట్ ఎవరి వంతు వస్తుందో చూడాలి మరి.