క్షణక్షణం ఉత్కంఠగా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వ్యవహారం.. ఎత్తుకు పైఎత్తు పాలిటిక్స్.. పైచేయి సాధించేదెవరు.?

ఇంకోవైపు వైసీపీ మేయర్‌ పీఠంపై ఆశలు వదులుకోవడం లేదు. ధీమా వ్యక్తం చేస్తూనే.. క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేసింది.

క్షణక్షణం ఉత్కంఠగా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం వ్యవహారం.. ఎత్తుకు పైఎత్తు పాలిటిక్స్.. పైచేయి సాధించేదెవరు.?

Updated On : March 25, 2025 / 8:29 PM IST

అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రేటర్ విశాఖ మేయర్‌ పీఠంపై కన్నేసింది కూటమి. రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్‌గా ఉన్న విశాఖ మేయర్ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు..అదును చూసి ఆపరేషన్ స్టార్ చేసింది. వైజాగ్ కార్పొరేషన్ పీఠం సొంతం చేసుకోవాలన్న నాలుగు దశాబ్ధాల కలను నెరవేర్చుకునేందుకు అవిశ్వాస అస్త్రాన్ని ఉపయోగిస్తోంది టీడీపీ.

ఇక వైసీపీ కార్పొరేటర్లకు వల వేయడంలో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి పెద్దఎత్తున కార్పొరేటర్లను చేర్చుకుంది కూటమి. విశాఖ కార్పొరేషన్‌లో 99 మంది కార్పోరేటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 97గా ఉంది. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలుపుకుని టోటల్ నంబర్ 112గా చెబుతున్నారు.

వైసీపీ మేయర్ అయిన హరి వెంకట కుమారి మీద అవిశ్వాస తీర్మానం నోటీసుకుని టీడీపీ కూటమి నేతలు కలెక్టర్‌కి అందచేశారు. దాంతో అవిశ్వాసం మీద చర్చకు డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. కార్పొరేషన్‌లో మొత్తం 75 మంది సభ్యుల బలం ఉంటేనే మేయర్ మీద అవిశ్వాసం నెగ్గుతుంది. అయితే కౌన్సిల్‌లో టీడీపీకి సొంతంగా 29 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి వచ్చిన చేరినవారితో కలుపుకుని ఆ బలం యాభై దాకా చేరింది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ మద్దతుతో 60 దాటుతుంది.

అవిశ్వాసం నెగ్గుతామని కూటమి నేతల ధీమా
జనసేన, బీజేపీ బలం మరో పది నుంచి పన్నెండు దాకా ఉంటుంది. అంటే 75 మంది సభ్యుల మద్దతుకు కూటమి చాలా దగ్గరగా ఉందని అంటున్నారు. వైసీపీకి 31 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందని చెబుతున్నారు. ఇందులో నుంచి కొందరిని తమ వైపు తిప్పుకుంటే తిరుగులేని మెజారిటీతో మేయర్ మీద అవిశ్వాసం నెగ్గుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే అపోజిషన్‌లో ఉన్నప్పటికీ వైసీపీ కూడా తగ్గడం లేదు.

తమ మొత్తం కార్పొరేటర్లను కాపాడుకోవడానికి క్యాంప్ రాజకీయాలకు తెర తీస్తోంది వైసీపీ. ఇక సీనియర్ మోస్ట్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ రంగంలోకి దించింది. దీంతో ఆయన తన వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ తన కార్పొటర్లను మొత్తం కాపాడుకుంటే మేయర్‌ను గద్దె దించడానికి అవసరమైన 75 మందికి కొంత లోటు ఏర్పడుతుందని అంటున్నారు.

అయితే తమకు సరిపడా బలం కంటే ఇంకా ఎక్కువే ఉందని కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. విశాఖ మేయర్ వైసీపీ చేతిలో నుంచి పోదని, తమ పార్టీకే కార్పొరేషన్ పీఠం దక్కుతుందని..మాజీ మంత్రి ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్‌ కురసాల కన్నబాబు చెబుతున్నారు. ఇలా ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ఈక్వేషన్స్ వాళ్లకు ఉన్నాయి. దాంతో ఎవరి మాట నిజం.? ఎవరికి అసలు బలం ఉంది.? అన్నది తెగని చర్చగా కంటిన్యూ అవుతోంది.

విశాఖ మేయర్ పీఠం సొంతం చేసుకోవాలని టీడీపీ నాలుగు దశాబ్దాలపైగా కలలు కంటోంది. దాంతో అధికారం ఉంది. జనసేన, బీజేపీ మద్దతు కూడా కలసి వస్తుంది. దీంతో ఈసారి ఎలాగైనా కలిసి వచ్చిన ఛాన్స్‌ను వాడుకుని మేయర్ కుర్చీని దక్కించుకోవాలని చూస్తోంది కూటమి. ఇప్పుడు చక్రం తిప్పకపోతే మరెప్పుడు అన్న చర్చ కూటమిలో సాగుతోంది.

 క్యాంప్ రాజకీయాలు మొదలు
ఇంకోవైపు వైసీపీ మేయర్‌ పీఠంపై ఆశలు వదులుకోవడం లేదు. ధీమా వ్యక్తం చేస్తూనే.. క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేసింది. వామపక్షాలకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లతో పాటు మరికొందరు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని..అవిశ్వాసం వీగిపోతుందని భావిస్తోంది ఫ్యాన్‌ పార్టీ. ఇలా క్షణ క్షణం ఉత్కంఠను రేపే విధంగా మేయర్ అవిశ్వాసం తీర్మానం ఎపిసోడ్ కొనసాగుతోంది.

అయితే కూటమి అధికారంలో ఉంది. ప్రస్తుతమున్న మేయర్‌పై కార్పొరేటర్ల కాస్త అసంతృప్తిగా ఉన్నారు. పైగా వైజాగ్ మేయర్ పరిధిలో వైసీపీకి ఎమ్మెల్యేలు, ఎంపీల ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా లేవు. దీంతో ఫ్యాన్ పార్టీ చేతులు ఎత్తేస్తుందని..వార్‌ వన్ సైడేనని భావించాయట కూటమి పార్టీలు.

కానీ అనూహ్యంగా వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెర తీయడం..బొత్సను రంగంలోకి దింపడం కూటమికి ఊహించని పరిణామంగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవిశ్వాస గండం నుంచి వైసీపీ బయటకు వస్తే ఏకంగా అయిదేళ్ళ పాటు విశాఖ మేయర్‌గా పాలించిన ఘనతను ఆ పార్టీ సొంతం చేసుకోనుంది. మేయర్ పీఠం కోసం జరుగుతోన్న పోరులో ఎవరిది పైచేయి అన్నది వేచి చూడాలి.