ఆ ఐపీఎస్‌లకు సెలవులు ఇస్తారా? డీజీపీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
డీజీపీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటం ఇష్టం లేని కొంతమంది ఐపీఎస్ లు.. వివిధ కారణాలతో లీవ్స్ కు అప్లయ్ చేసుకున్నారు.

AP IPS Officers Row : ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు నిర్ణయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులను హెడ్ క్వార్టర్స్ కు రావాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటున్నారు.
అయితే, డీజీపీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటం ఇష్టం లేని కొంతమంది ఐపీఎస్ లు.. వివిధ కారణాలతో లీవ్స్ కు అప్లయ్ చేసుకున్నారు. అయితే అప్లయ్ చేసుకున్న సెలవుల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కారణాలు వాస్తవంగా ఉంటేనే సెలవులు ఇవ్వాలని, లేదంటే సెలవులు ఉండవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన వ్యవహారం ఏపీలో ఆసక్తికరంగా మారింది. రోజూ డీజీపీ ఆఫీసుకు రావాలని, సాయంత్రం వరకు అక్కడే ఉండాలని వారందరికి డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొందరు ఐపీఎస్ లు డీజీపీ కార్యాలయానికి వస్తున్నారు. అటెండెన్స్ బుక్ లో సంతకం చేస్తున్నారు. అయితే, కొంతమంది ఐపీఎస్ లు సెలవులు కావాలని డీజీపీ కార్యాలయానికి అప్లయ్ చేసుకున్నారు. అయితే, లీవ్స్ కోసం వారు చెబుతున్న కారణాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది డీజీపీ కార్యాలయం పరిశీలిస్తోంది. ఆ తర్వాతే వారికి సెలవు ఇవ్వాలా, వద్దా అనేది పరిశీలిస్తున్నారు.
అనారోగ్యం కారణంగా తాము రాలేకపోతున్నామని, మాకు సెలవు ఇప్పించాలని కొంతమంది ఐపీఎస్ లు రిక్వెస్ట్ చేసుకున్నారు. మరికొందరు మేము హైదరాబాద్ లో ఉంటున్నాము, హైదరాబాద్ నుంచి ఏపీకి షిఫ్ట్ కావడానికి కొంత సమయం పడుతుందని, దానికి సంబంధించి మాకు లీవ్స్ ఇవ్వాలని ఏపీ డీజీపీ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే, వారు చెప్పిన కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎవరూ చేయని విధంగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ లను డీజీపీ ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలని ఆదేశించడం సంచలనంగా మారింది. డీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులను హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులకు అనుగుణంగా వ్యవహరించారని, ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురి చేశారని ఈ ఐపీఎస్ లపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ ఐపీఎస్ లకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. అంతేకాదు. హెడ్ క్వార్టర్స్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలని ఆదేశాలు కూడా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : ఆ అధికారులు అందరూ జైలుకు వెళ్లడం ఖాయం : బుద్ధ వెంకన్న