వైసీపీ నేత దారుణ హత్య

కృష్ణాజిల్లాలో వైసీపీ నేత, మంత్రి అనుచరుడు దారుణహత్యకు గురయ్యారు. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావును(57) దుండగులు హత్య చేశారు.
సోమవారం ఉదయం 11-30 గంటల సమయంలో మంత్రి పేర్ని నాని ఆదేశాల మేరకు భాస్కరరావు చేపల మార్కెట్ లో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు అక్కడ వచ్చారు. పనులను పర్యవేక్షించి తిరిగి వెళుతున్న సమయంలో అక్కడే కాపు కాసిన దుండగులు భాస్కరరావుపై దూసుకువచ్చి ఆయన్ను కింద పడేసి గుండెలపై రెండు చోట్ల, పొట్టపైన కత్తితో పొడిచి పరారయ్యారు. గుండెలపై పొడిచినప్పుడు ఆకత్తి సెల్ ఫోన్ కు తగలటంతో బ్యాటరీ పేలిపోయింది. దీంతో చొక్కాతో పాటు వంటిపైనా కాలిన గాయాలయ్యాయి.
నేరుగా గుండెల్లో గురిచేసి పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన భాస్కరరావును ఆటోలో హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. భాస్కరావుకు భార్య కుమార్తె ఉన్నారు. ప్రశాతంగా ఉండే మచిలీపట్నంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ హత్య జరగటంతో జిల్లాలోనే సంచలనం రేపుతోంది. భాస్కర రావు రాష్ట్ర రవాణా సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అనుచరునిగా ఉన్నారు.
హైదరాబాద్ ప్రయాణంలో ఉన్న మంత్రి పేర్ని నాని విషయం తెలుసుకుని ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ హత్యలో ఇద్దరు కంటే ఎక్కువమందే పాల్గోన్నట్లు ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి భాస్కరరావు కదలికలపై రెక్కీ నిర్వహించే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నాం. ప్రత్యక్ష సాక్ష్యులు, సీసీ పుటేజ్ ఆధారంగా కేసు విచారణ చేపట్టాం. విచారణ కోసం మూడు బృందాలు, నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.
Read:విశాఖలో మరో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి