Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశే.. రిమాండ్‌ను పొడగించిన సీఐడీ కోర్టు
గవన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.

Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi: గవన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి నేటితో రిమాండు ముగిసింది. దీంతో శుక్రవారం గన్నవరం పోలీసులు వంశీని జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలించారు. వంశీతోపాటు నిమ్మ లక్ష్మీపతిని పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపర్చారు. దీంతో వంశీకి ఏప్రిల్ 9వ తేదీ వరకు సీఐడీ కోర్టు రిమాండ్ పొడిగించింది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గురువారం వంశీ బెయిల్ పిటిషన్ ను విజయవాడ సీఐడీ కోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. వంశీతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురి బెయిల్ పిటిషన్లనుసైతం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వంశీపై రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని వంశీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఘటనకు వంశీకి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులపై ప్రభావం పడుతుందని సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న సీఐడీ కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ వేసిన పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. సత్యవర్ధన్ ను బెదిరించడం, కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టయిన వంశీ.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.