మార్పుల్లో మార్పుతో క్యాడర్‌లో గందరగోళం.. కర్నూలు వైసీపీలో ఏం జరుగుతోంది?

ఎమ్మిగనూరులో గెలుపు కోసం పార్టీ తీసుకున్న నిర్ణయం తమ నేతను బలిపశువును చేసిందని వారం రోజుల ఇన్‌చార్జి మాచాని వెంకటేశ్‌ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మార్పుల్లో మార్పుతో క్యాడర్‌లో గందరగోళం.. కర్నూలు వైసీపీలో ఏం జరుగుతోంది?

Confusion In Kurnool YCP Cadre

Kurnool YCP : అధికార పార్టీలో కర్నూలు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇన్‌చార్జుల మార్పుచేర్పుల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని టెన్షన్‌తో నేతలు నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నారు. కొత్తగా ఇన్‌చార్జి పదవి ఇచ్చినా ఎన్నికల వరకు కొనసాగిస్తారనే గ్యారెంటీ లేక.. అధిష్టానం ఆలోచనలు ఏంటో తెలుసుకోలేక.. అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు.

మార్పుల్లో మార్పుతో అయోమయ పరిస్థితి..
కర్నూలు జిల్లాలో అధికార వైసీపీకి గట్టి క్యాడర్‌ ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసింది వైసీపీ. ఐదేళ్లుగా పార్టీ క్యాడర్‌పై పూర్తి పట్టుసాధించిన అధిష్టానం.. ఎన్నికల ముందు తీసుకుంటున్న నిర్ణయాలతో క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టేస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పుల్లో భాగంగా జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల కొత్తవారికి బాధ్యతలు అప్పగించగా, వారినీ మళ్లీ మార్చేస్తుండటంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వైసీపీ కార్యకర్తలు.

Also Read : టీడీపీ గుంటూరు ఎంపీ టికెట్‌ ఎవరికి? సీటు కోసం ఆ ఇద్దరు ప్రముఖుల పోటీ

ఎన్నికల వరకు ఎవరి పదవికి నో గ్యారెంటీ..
జిల్లాలోని ఎమ్మిగనూరు స్థానానికి కొద్దిరోజుల క్రితం మాచాని వెంకటేశ్‌ను సమన్వయకర్తగా నియమించారు. ఈయనే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా భావించారు. ఐతే వెంకటేశ్‌ను ఇన్‌చార్జిగా నియమించిన కొద్దిరోజులకే ఆయన స్థానంలో బుట్టా రేణుకను తెరపైకి తీసుకువచ్చారు. వాస్తవానికి ఎమ్మిగనూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పించి.. ఆయన సూచించిన మాచాని వెంకటేశ్‌ను తీసుకువచ్చిన పార్టీ.. అంతలోనే మార్పు చేసింది. ఎమ్మిగనూరు ఎపిసోడ్‌ గమనిస్తే.. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేవరకు ఎవరూ శాశ్వతంగా ఆ పదవిలో ఉంటారనే గ్యారెంటీ లేదని సంకేతాలు పంపినట్లైంది.

తమ నేతను బలిపశువును చేసిందని ఆవేదన..
ఇక ఎమ్మిగనూరు కొత్త ఇన్‌చార్జిగా వచ్చిన బుట్టా రేణుక గతంలో కర్నూలు ఎంపీగా పనిచేశారు. 2014లో ఎంపీగా గెలిచిన రేణుక.. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. గత ఎన్నికల ముందు మళ్లీ వైసీపీలో చేరారు. ఈసారి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని భావించినా, ఎమ్మిగనూరులో చేనేత వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో రేణుకను ఇక్కడి నుంచి పోటీకి దించాలని నిర్ణయించింది పార్టీ. ఎమ్మిగనూరులో గెలుపు కోసం పార్టీ తీసుకున్న నిర్ణయం తమ నేతను బలిపశువును చేసిందని వారం రోజుల ఇన్‌చార్జి మాచాని వెంకటేశ్‌ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read : టీడీపీ-జనసేన కూటమితో పొత్తు లేనట్టేనా? ఏపీ ఎన్నికల్లో వ్యూహం మార్చిన బీజేపీ..! కారణం అదేనా?