టీడీపీ-జనసేన కూటమితో పొత్తు లేనట్టేనా? ఏపీ ఎన్నికల్లో వ్యూహం మార్చిన బీజేపీ..! కారణం అదేనా?

రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం కోరిక మేరకు, తెలుగుదేశం-జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని ఓ వారం క్రితం వరకు భావించిన బీజేపీ అగ్రనాయకత్వం తాజాగా..

టీడీపీ-జనసేన కూటమితో పొత్తు లేనట్టేనా? ఏపీ ఎన్నికల్లో వ్యూహం మార్చిన బీజేపీ..! కారణం అదేనా?

BJP Political Strategy : ఏపీలో టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ జట్టుకడుతుందా? లేదా? గత ఐదేళ్లుగా సహకరిస్తున్న అధికార వైసీపీపై బీజేపీపై ఆలోచన ఎలా ఉంది? పొత్తుల్లో వచ్చే ఒకటి రెండు సీట్లు బీజేపీ అవసరం లేదనుకుంటుందా? పొత్తుల ద్వారా ఏపీలో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని భావిస్తోందా? టీడీపీ-జనసేన కూటమిపై బీజేపీ వ్యూహం ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఏపీపై బీజేపీ స్కెచ్‌ ఏంటి?

పొత్తుపై మారిన బీజేపీ వ్యూహం..
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమితో పొత్తు పెట్టుకునే అంశంపై బీజేపీ వ్యూహం మారింది. కాదు.. కాదు.. ఆలోచన మారింది. రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం కోరిక మేరకు, తెలుగుదేశం-జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని ఓ వారం క్రితం వరకు భావించిన బీజేపీ అగ్రనాయకత్వం తాజాగా తన మనసు మార్చుకుంది. జాతీయ స్థాయిలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు బాగా అనుకూలంగా కనిపిస్తున్న వాతావరణంలో, తమకు పెద్దగా ప్రాబల్యం లేని ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని, ఒకటి-రెండు లోక్‌సభ సీట్లు తెచ్చుకున్నా, పెద్దగా ఒరిగేది ఏముందని బీజేపీ నాయకత్వం ఇప్పుడు భావిస్తోంది.

Also Read : టీడీపీ గుంటూరు ఎంపీ టికెట్‌ ఎవరికి? సీటు కోసం ఆ ఇద్దరు ప్రముఖుల పోటీ

వైఎస్‌ఆర్‌సీపీతో తెగదెంపులు ఎందుకు?
ఈ కొద్దిపాటి సీట్ల కోసం.. ఇప్పటిదాకా తమతో ఎంతో సఖ్యతగా ఉన్న, తమకు అన్ని రకాలుగా సహకరించిన వైఎస్‌ఆర్‌సీపీతో ఎందుకు తెగదెంపులు చేసుకోవాలన్న ప్రశ్న కూడా బీజేపీ నాయకత్వానికి ఎదురవుతోంది. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకునే ఏపీ వరకు తాము బహిరంగంగా ఎవరివైపు మొగ్గు చూపకుండా ఉండటమే మంచిదన్న నిర్ణయానికి తాజాగా బీజేపీ నాయకత్వం వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ ఆలోచనలో వచ్చిన ఈ మార్పునకు దారితీసిన కీలక అంశాలు..

లోక్‌సభ సీట్ల కంటే రాజ్యసభ సీట్లు అవసరమే ఎక్కువ..
ఒకటి… ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ లోక్‌సభ సీట్ల కంటే రాజ్యసభ సీట్లు అవసరమే ఎక్కువ ఉంది. రెండు.. రాజ్యసభలో వైసీపీకి మొత్తం 10 నుంచి 11 సీట్లు ఉంటాయి. తెలుగుదేశం-జనసేన కూటమికి రాజ్యసభలో సీట్లు దాదాపు ఇప్పట్లో ఉండవనే చెప్పాలి.

వైసీపీకి దూరం కావాల్సిన అవసరం ఏంటి?
మూడు.. టీడీపీ-జనసేనతో పొత్తు పెట్టుకున్నా.. వచ్చే ఒకటి రెండు లోక్‌సభ సీట్లు పెద్దగా లెక్కలోకి రావు. ఇక నాలుగు.. తమతో పూర్తిగా సహకరిస్తున్న వైసీపీకి దూరం కావాల్సిన అవసరం ఏంటి? ఐదు.. ఎన్నికల తర్వాత, ఇరుపక్షాల్లో ఎవరికి ఎన్ని లోక్‌సభ సీట్లు వచ్చినా, అంతిమంగా ఇరుపక్షాల మద్దతు తమకే ఉంటుంది. ఇక ఆరు.. తెలుగుదేశం – జనసేన కూటమితో పొత్తు పెట్టుకున్నా.. ఇప్పటికిప్పుడు ఏపీలో బీజేపీ సంస్థాగతంగా బలపడే అవకాశాలు తక్కువ.

Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే? వైసీపీ సిట్టింగ్‌ ఎంపీలకూ టికెట్లు..!

ఇరుపక్షాలకు సమదూరమే మంచిది..!
ఏడు.. ప్రతిపక్ష ఇండియా కూటమి కకావికలమైపోయే అవకాశం కనిపిస్తుండటంతో.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగు ఉండదు. వాస్తవానికి తెలుగుదేశం-జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని బీజేపీలోని ఒక వర్గం గట్టి ప్రయత్నాలే చేసింది. ఒక దశలో ఈ ప్రయత్నాలు ఫలించినట్లే కన్పించాయి. జనసేన కూడా ఏపీలో బీజేపీ తమ కూటమితో కలిసి పోటీ చేయాలని గట్టిగా కోరుకుంటోంది. అయితే లాభనష్టాలు కూడికలు తీసివేతల అనంతరం రానున్న ఎన్నికల్లో ఏపీలో ఇరుపక్షాలకు సమదూరంలో ఉండటమే మంచిదనే నిర్ణయానికి బీజేపీ అగ్రనాయకత్వం వచ్చింది. దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు మరికొద్ది రోజుల్లోనే వెలువడే అవకాశం ఉంది.