వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్ భావోద్వేగ ట్వీట్.. కంటతడి పెట్టిన విజయమ్మ
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఆప్యాయంగా హత్తుకొని ..

YS Jagan Mohan Reddy
YSR Jayanthi 2024 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని వైఎస్ఆర్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయాన్నే వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, కటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొద్దిసేపటికి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. భారీ సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు.
Also Read : YSR Jayanthi 2024 : ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్‌మోహన్ రెడ్డి, విజయమ్మ
జగన్ భావోద్వేగ ట్వీట్..
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సాఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరి వరకూ మా కృషి’. అంటూ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నాడు.
Also Read : YSR Jayanthi 2024 : వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ షర్మిల, కుటుంబ సభ్యులు
విజయమ్మ కంటతడి..
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. కొడుకు జగన్ మోహన్ రెడ్డిని ఆప్యాయంగా హత్తుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ క్రమంలో జగన్ తల్లి విజయమ్మను ఓదార్చారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న అభిమానులకు అభివాదం చేసుకుంటూ జగన్ ఘాట్ నుంచి ముందుకు సాగగా.. వైఎస్ విజయమ్మ ఘాట్ వద్దే ఉండి కంటతడి పెట్టుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు.