Ys Jagan Mohan Reddy : చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి.. మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..

రంగరాజన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు జగన్.

Ys Jagan Mohan Reddy : చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి.. మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..

Updated On : February 19, 2025 / 4:36 PM IST

Ys Jagan Mohan Reddy : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్‌ రంగరాజన్‌ పై దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖులు దీనిపై తీవ్రంగా స్పందించారు. రంగరాజన్ పై దాడిని వారంతా ముక్త కంఠంతో ఖండించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం రంగరాజన్ పై దాడిని తప్పుపట్టారు. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తాజాగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దీనిపై స్పందించారు. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ను ఫోన్‌లో పరామర్శించారు జగన్. దాడి ఘటన వివరాలు ఆరా తీశారు. రంగరాజన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు జగన్. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరం అని జగన్ అన్నారు.

Also Read : ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేశారా? మీకో అప్‌డేట్‌..

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి సంచలనం రేపింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఘటన జరిగింది. రంగరాజన్ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపైనా దాడి చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డితోపాటు ఆయన అనుచరులను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రంగరాజన్ పై వీర రాఘవ రెడ్డి దాడి..
తన అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీర రాఘవ రెడ్డి.. తనకు చందా ఇవ్వడంతోపాటు తన ఆర్మీకి సపోర్ట్ చేయాలని ఆయనపై ఒత్తిడి చేశారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో దాడి చేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పలువురు రాజకీయ నాయకులు, హిందూ ధార్మిక సంస్థలు రంగరాజన్ ను పరామర్శించి మద్దతు తెలిపాయి.

Also Read : చంద్రబాబు.. ఇప్పటికైనా కళ్లు తెరువు.. రైతుల కష్టాలు తెలుసుకో.. : వైఎస్ జగన్

రామరాజ్యం సైన్యం పేరుతో అరాచకాలు..
రంగరాజన్ పై దాడి కేసులో రామరాజ్యం వీర రాఘవరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. రిమాండ్ రిపోర్ట్ లో వీర రాఘవరెడ్డికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామరాజ్యం సైన్యం పేరుతో వీర రాఘవ రెడ్డి చేసిన అరాచకాలు బయటపడ్డాయి.