చంద్రబాబు.. ఇప్పటికైనా కళ్లు తెరువు.. రైతుల కష్టాలు తెలుసుకో.. : వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం.

YS Jagan mohan Reddy
YS Jagan: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏ ఒక్క రైతూ సంతోషంగా లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లారు. మిర్చి పంటకు ఎంత పెట్టుబడి పెడుతున్నారు.. ఎంత దిగుబడి వస్తుంది.. మార్కెట్ లో ఎంత ధర లభిస్తుందనే విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Tuni: తునిలో సై అంటే సై అంటున్న టీడీపీ, వైసీపీ.. ఈ నేతకు పట్టు చిక్కినట్లే చిక్కి చేజారిపోతోందా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. మా హయాంలో రైతే రాజు.. కానీ, కూటమి ప్రభుత్వం రైతులను దగా చేసిందని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వం పెట్టబడి సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీరాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మాలంటే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోంది అంటూ జగన్ ఆరోపించారు.
Also Read: AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా..!
మిర్చి రైతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. ఆర్బీకే వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు. రైతు సమస్యలపై మాట్లాడటానికి వస్తుంటే అడ్డుకున్నారు. తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది.. ఆ రోజు చంద్రబాబుకు కనీసం సెక్యూరిటీ లేకుండా చేయగలం అంటూ జగన్ హెచ్చరించారు. సచివాలయానికి మిర్చి యార్డుకి ఎంతోదూరం లేదు.. అయినా, రైతుల కష్టాలు కనీసం నీకు పట్టడం లేదా అంటూ చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతుల కష్టాలు తీసుకోవాలి.. వాళ్లకు అండగా ఉండాలి. లేకుంటే రాబోయే రోజుల్లో రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. వారి సమస్యలపై ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు.