ఏపీకి భారీవర్ష సూచన.. ‘నివర్ తుపాను’ ప్రభావం ఉండొచ్చు : సీఎం

Nivar Cyclone effect on Andhra Pradesh : నివర్ తుపానుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నివర్ తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం అధికంగానే ఉంటుందని సీఎం జగన్ అన్నారు.
ఏపీకి భారీ వర్ష సూచన ఉందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రేపు సాయంత్రం నుంచి, ఎల్లుండి వరకూ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడే అవకాశాలు ఉన్నాయని, అందరూ సన్నద్ధంగా ఉండాల్సిందిగా ఆదేశించారు.
నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలపై 11–20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని,పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణకోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలని, కోతకోసిన పంటలను రక్షించేందుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
ఒకవేళ ఇంకా పొలంలోనే పంటలు ఉంటే.. వాటిని కోయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ విషయంలో రైతులంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబరు వరకూ పడ్డ వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్న నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలు పడితే… చెరువులు గండ్లు పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
https://10tv.in/rains-with-nivar-cyclone-in-ap-and-telangana-tamilnadu/
ఈ గండ్లు పడకుండా నిరంతరం మానిటరింగ్ చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు.
గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దశ, దిశ చూపాలని ప్రభుత్వ అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ వాలంటీర్ల సేవలను పెద్ద స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు కరెంటు సరఫరాకు ఇబ్బందులు లేకుండా పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధంచేసుకోవాలన్నారు.
ప్రతిజిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలని, మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌రూమ్స్ ఉండాలని చెప్పారు. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి వరకూ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు.