YS Viveka case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ .. కడప నుంచి పులివెందులకు పోలీస్ స్పెషల్ ఫోర్స్..ఏం జరుగనుంది..?!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరుగుతోంది? అవినాశ్ బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టు ఏం ఆదేశించనుంది? అవినాశ్ కు బెయిల్ వచ్చేనా? లేక అరెస్ట్ అనివార్యమా? ఇటువంటి పరిస్థితుల్లో కడపనుంచి పులివెందులకు పోలీస్ స్పెషల్ ఫోర్స్ రావటం వెనుక కారణమేంటి? ఈకేసులో చంచల్ గూడ జైలులో ఉన్న భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ఎందుకు భారీగా మోహరించారు?అసలు ఏంజరుగుతోంది?

YS viveka case
YS Viveka case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ హత్య కేసులో అనూహ్యంగా అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి అరెస్ట్ అవ్వటంతో తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాశ్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేయటం దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తు సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఈ సందర్భంగా చీఫ్ ధర్మాసనం ప్రతివాది న్యాయమూర్తులపైనా ఈకేసులో నిందితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణలను ఏప్రిల్ 24న విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ పిటీషన్ పై జరిగే విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇటువంటి పరిస్థితుల్లో వారి సొంత జిల్లా అయిన కడపలో తీవ్ర ఉద్రికత నెలకొంది. అవినాశ్ బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న క్రమంలో కడప నుంచి పులివెందులకు పోలీస్ స్పెషల్ ఫోర్స్ చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చంచల్ గూడ జైలులో ఉన్న అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఓ పక్క అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీంలో విచారణ కొనసాగుతున్న క్రమంలో ఆన మరోసారి సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నారు. అవినాష్ ను అరెస్ట్ చేయద్దంటూ సుప్రీం ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగియనుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై నిందితుల అరెస్ట్ జరుగుతుందా? లేదా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.
కాగా ఈకేసులో మరీ కీలక విషయం కూడా చోటుచేసుకుంది. పులివెందులలో సీబీఐ టీంలు విచారణకు మరోసారి రంగంలోకి దిగాయి. గతంలో వివేకా వద్ద కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటి వద్దే కారులోనే ఇనాయతుల్లాను ప్రశ్నించారు అధికారులు. వివేకా హత్య జరిగిన రోజున ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై ఆరా తీశారు. హత్య జరిగిన రోజు వివేకా పార్థివదేహాన్ని ముందుగా ఫొటోలు, వీడియోలు తీసి ఆయన కుటుంబ సభ్యులకు పంపింది ఇనాయతుల్లానే. దాంతో ఇనాయతుల్లాను విచారించారు అధికారులు. అటు, ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ అధికారులు వెళ్లారు. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులలో వివేక హత్య కేసు విచారణ పలు మలుపులు తిరుగుతూ.. ఏం జరుగుందా? అనేది క్షణక్షణం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈరోజు అవినాశ్ బెయిల్ పిటీషన్ తో పాటు వివేకా కేసు విచారణ గడువుపై కూడా నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది.