YSR Cheyutha: అక్కచెల్లెమ్మలకు అండగా.. నేడే వైఎస్సార్ చేయూత.. నేరుగా అకౌంట్లోకి!
అక్కచెల్లెమ్మలకు అండగా అంటూ ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45నుంచి 60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున అకౌంట్లలో నేరుగా వెయ్యనుంది.

Ysr Cheyutha Scheme 2021 Phase 2 Beneficiary Payment Will Deposit Today
YSR Cheyutha Scheme 2021: అక్కచెల్లెమ్మలకు అండగా అంటూ ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45నుంచి 60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున అకౌంట్లలో నేరుగా వెయ్యనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(22 జూన్ 2021) ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు.
రాష్ట్రంలోని 45ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో 75వేల రూపాయలను ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19వేల కోట్లు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా వరుసగా రెండో ఏడాది 23లక్షల 14వేల 342 మంది మహిళలకు 4వేల 339కోట్ల ప్రభుత్వం మహిళల ఖాతాల్లో జమ చెయ్యనుంది. మొదటి, రెండో విడతలో కలిపి 8వేల 943కోట్ల రూపాయలను మహిళలకు ప్రభుత్వం ఇచ్చినట్లుగా అవుతుంది.
ఈ ఆర్థిక సహాయంతో మహిళలు కిరాణా షాపులతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేస్తుంది. గతేడాది అందజేసిన సాయంతో 78వేల మంది మహిళలు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోగా లక్షా 90వేల 517 మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం చేపట్టి కుటుంబ ఆదాయాన్ని పెంచుకున్నారు.