వైసీపీలో గంటకొట్టాలనుకున్నా ఆటంకాలు… నిరసనల వెనుక ఆ మంత్రి అనుచరులు?

వైసీపీలో గంటకొట్టాలనుకున్నా ఆటంకాలు…  నిరసనల వెనుక ఆ మంత్రి అనుచరులు?

Updated On : August 11, 2020 / 4:10 PM IST

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారనే ప్రచారంపై భీమిలి వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారని ఆరోపిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కేసులు పెట్టించారని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు పార్టీలోకి తీసుకుంటే తాము అంగీకరించబోమని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. గంటా శ్రీనివాసరావు గతంలో భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహించినవారే. ఇప్పుడు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.



తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన భీమిలి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు తమను ఎన్నో రకాలుగా వేధించారని, కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. 2018, సెప్టెంబరులో తమ అధినేత జగన్‌ పాదయాత్రలో భాగంగా భీమిలి రాగా నాడు మంత్రిగా ఉన్న గంటా చిన్నాపురం జంక్షన్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూలగొట్టించారని గుర్తు చేస్తున్నారు. ఆయనతోపాటు అనుచరవర్గం పలు అక్రమాలకు పాల్పడ్డారని, భూ కబ్జాలు చేశారని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

గంటా రాకను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు రాకను జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముత్తంశెట్టి అయితే పలుమార్లు పార్టీ సమావేశాలు, ప్రెస్‌మీట్లలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గంటా ప్రజలకు మేలు చేయడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో పార్టీ మారడం లేదని, తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకేనని అవంతి దుయ్యబడుతున్నారు.



అధికారం లేకపోతే ఉండలేరన్నది వైసీపీ వర్గాల వాదనగా ఉంది. భీమిలిలో కార్యకర్తలు, ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్ అభ్యర్ధులు చేసిన ఆందోళనల వెనుక మంత్రి అవంతి శ్రీనివాసరావు హస్తం ఉందన్నది గంటా వర్గం ఆరోపణ. తాము రావడం ఇష్టం లేకనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఇప్పటి వరకూ వైసీపీ నుంచి కానీ, ఇటు గంటా నుంచి కానీ పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన రాలేదు.