ఒంగోలులో భారీ మెజారిటీతో గెలవబోతున్నా: బాలినేని శ్రీనివాసరెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.

Balineni Srinivasa Reddy: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తోసిపుచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో తాను భారీ మెజారిటీతో గెలవబోతున్నానని అన్నారు. ఎవరెన్ని చెప్పినా తమ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
”ఒంగోలులో నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నాను. జిల్లాలో వైసీపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతోంది.వైఎస్ జగన్ మరోసారి సీఎం కాబోతున్నారు. ఎగ్జిట్ పోల్ పై జాతీయ సర్వేలు ఇస్తున్న అంచనా రిపోర్టులు ఒక ఫేక్. రోజుకొక రీతిలో తమ ఇష్టమొచ్చినట్లు సంఖ్యను మార్చి చెబుతున్నాయి. ఇలాంటి తప్పుడు సర్వేలు ఎన్ని ఇచ్చినా రేపు గెలవబోయేది, ఏపీలో అధికారంలోకి రాబోయేది వైసీపీనే. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. రేపటి కౌంటింగ్ రోజు ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాల”ని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
Also Read: భార్య గెలుపు కోసం పొర్లుదండాలు పెట్టిన సీనియర్ హీరో.. వీడియో వైరల్
జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం: నేదురుమల్లి
ఏపీ మరోసారి తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారని వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”జగన్ మళ్లీ సీఎం అవుతారనడానికి సంకేతంగానే రెండు రోజులు ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జగన్ వస్తున్నారని తెలిసే వరుణుడు ముందుగా వచ్చారు. హామీలు నెరవేర్చక మునుపే 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. అన్నీ నెరవేర్చిన జగన్ కు ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీట్లు ఇస్తార”ని వ్యాఖ్యానించారు.