Jagan Nellore Tour: జగన్ హెలిప్యాడ్ వివాదం.. అక్కడ హెలికాప్టర్ దిగడం ప్రమాదం..! కుట్ర ఉందంటూ ప్రభుత్వంపై వైసీపీ నేతల ఆగ్రహం..

జగన్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారు.

Jagan Nellore Tour: జగన్ హెలిప్యాడ్ వివాదం.. అక్కడ హెలికాప్టర్ దిగడం ప్రమాదం..! కుట్ర ఉందంటూ ప్రభుత్వంపై వైసీపీ నేతల ఆగ్రహం..

Updated On : June 30, 2025 / 9:37 PM IST

Jagan Nellore Tour: నెల్లూరులో వైసీపీ చీఫ్ జగన్ పర్యటనపై ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. తాము అడిగిన చోట హెలిప్యాడ్ కు అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తాము అడిగిన చోట కాకుండా మరో ప్రాంతంలో హెలిప్యాడ్ కు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని, అయితే అక్కడ హెలికాప్టర్ దిగడం చాలా కష్టం అని, పైగా ఆ చోటు చాలా ప్రమాదకరం అని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

”హెలిప్యాడ్ కోసం అనేక ప్రాంతాలు అన్వేషించాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా జగన్ పర్యటన చేయాలని ప్లాన్ చేశాం. దగ్గరలోని కొత్తూరు సమీపంలోని ఓ పాఠశాలలో హెలిప్యాడ్ ఏర్పాటుకి ప్రయత్నం చేశాం. 28న హెలిప్యాడ్ అనుమతి కోసం అధికారులని కోరాము. ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదు. కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు జగన్ వస్తే ప్రభుత్వానికి ఎందుకు భయం.

జగన్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో హెలిప్యాడ్ చూపించారు. అక్కడ హెలికాప్టర్ దిగడం సరైంది కాదని ఏవియేషన్ అధికారులు అంటున్నారు. ఎంత అడ్డుకోవాలని చూసినా 3న నెల్లూరుకు జగన్ వచ్చి తీరుతారు” అని మాజీ మంత్రి అనిల్ తేల్చి చెప్పారు.

Also Read: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఆరోపణల వెనుక కుట్ర కోణం..! సీసీటీవీ ఫుటేజ్‌తో బట్టబయలు..

”జూన్ 26న మొదటగా జగన్ రావాల్సి ఉంది. కావాలనే కాకాణిని ఆ సమయంలో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. తర్వాత జూలై 3న జగన్ పర్యటన ఖరారు చేసి… 27న అనుమతుల కోసం అధికారులకు వినతిపత్రం ఇచ్చాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్తూరు వద్ద ఓ స్కూల్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశాం. రెండు ప్రాంతాలని హెలిప్యాడ్ కోసం చూసి అధికారులకి చెబితే ఒక కిలోమీటర్ దూరంలో హెలిప్యాడ్ పెట్టుకోమన్నారు. 100 నుంచి 200 మంది వరకే జనాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు.

జైలుకి దగ్గరలో ముళ్లపొదల్లో హెలిప్యాడ్ పర్మిషన్ ఇస్తాం అన్నారు. అక్కడ హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. పెద్ద బిల్డింగ్ ఉంది. అక్కడ హెలికాప్టర్ దిగడం కష్టం అని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ హెలికాప్టర్ దిగి వెళ్ళాలంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుస్తోంది.

జగన్ పర్యటనకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. జగన్ పర్యటనకు 100 మందికి మాత్రమే అనుమతి అంటే ఎంతవరకు సమంజసం? స్వేచ్ఛగా తిరిగే హక్కు ఏపీలో ఎవరికీ లేదా? టీడీపీ హయాంలో కందుకూరులో ఆరు మంది చనిపోయారు. మిమ్మల్ని ఎక్కడన్నా వైసీపీ ప్రభుత్వం ఆపిందా…? జగన్ కి వస్తున్న ప్రజాదరణని చూసి ఓర్చుకోలేక ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.