విశాఖకు రాజధాని తరలింపుపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యతిరేకత

రాజధాని తరలింపు నిర్ణయం గుంటూరు జిల్లాలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జిల్లా ఓటర్లు గత ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించారు. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు గాను 14 చోట్ల, రెండు పార్లమెంట్ స్ధానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇంతటి ఘనవిజయాన్ని సమకూర్చిన గుంటూరు జిల్లా వాసులకు, అధికార వైసీపీ తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయం ఏమాత్రం రుచించడం లేదట.
ఎన్నికల ముందు ఏపీ రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యనే ఉంటుందని, ఎక్కడికి మార్చేదిలేదని ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి స్వయంగా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ పదే పదే వైసీపీ ప్రభుత్వం వస్తే అమరావతిని తరలించేస్తారని ప్రచారం చేసింది. దీనిని తిప్పికొట్టేందుకు స్థానిక నేతలు కూడా రాజధాని ఇక్కడే ఉంటుందని గట్టిగా చెప్పారు.
వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అనుహ్య రీతిలో సీఎం జగన్ పరిపాలనా వికేంద్రీకరణ నిర్ణయంతో స్ధానిక వైసీపీ శాసనసభ్యులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయినా బయటకు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు. నిన్నటి దాకా ఒకవైపు అమరావతి రైతుల ఉద్యమాలు, మరోవైపు కోర్టులో కేసులు నడుస్తుండటంతో స్ధానిక నేతలు తమ నియోజకవర్గాల్లో కొంతమేర స్వేచ్ఛగానే తిరగగలిగారు.
ఆగష్టులోనే పరిపాలనా రాజధాని అమరావతి నుండి తరలించాలన్న ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుడటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని ప్రజలు పార్టీలకు అతీతంగా రాజధాని ఇక్కడి నుంచి తరలిపోనుండడంపై తీవ్ర స్ధాయి ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ స్థానిక నేతలు సైతం ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఏంచేయాలో అర్థంకాక మౌనంగా ఉండిపోతున్నారు. ఇదే విషయంపై తమ ఎమ్మెల్యేలను స్ధానిక వైసీపీ నేతలు నిలదీస్తున్నారని చెబుతున్నారు. ఇలా అయితే పార్టీలో కీలకంగా తాము వ్యవహరించలేమంటూ స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని ఎమ్మెల్యేల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో భవిష్యత్తులో కూడా తమకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్న తరుణంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో తమ పొలిటికల్ కెరీర్ బలి కాబోతుందని ఊహించుకుని ఆందోళన చెందుతున్నారు. సొంత పార్టీ నేతలతోపాటు, ప్రత్యర్థి పార్టీల నుంచి, జిల్లాలోని అన్ని వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక తమతమలో తామే కుమిలిపోతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు.
కొంత మంది ఎమ్మెల్యేలు పైకి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నా లోపల మాత్రం రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతున్న వారికి తెరవెనుక సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారట. జగన్ నిర్ణయాన్ని తాము ప్రత్యక్షంగా వ్యతిరేకించలేం కనుక పరోక్షంగా మీ ఉద్యమానికి మద్దతు ఉంటుందని చెబుతున్నారట. ఈ పద్ధతి ద్వారా అయినా కొంతమేర వ్యతిరేకత నుంచి బయట పడొచ్చనేది ఆ ఎమ్మెల్యేల ఆలోచన అని అంటున్నారు.
ప్రస్తుతం పరిపాలనా రాజధాని తరలింపు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ నియోజకవర్గాల్లో పర్యటనలకు వెళ్లకుండా ఉండటమే మేలని చాలామంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. నియోజకవర్గంలోని స్ధానిక నేతలు ఏర్పటు చేసే కార్యక్రమాలకు సైతం కరోనాను బూచిగా చూపించి డుమ్మా కొట్టేందుకే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది రాజధాని తరలింపు నిర్ణయంతో ఇక తాము వన్ టైం ఎమ్మెల్యేలమేనని డిసైడైపోయారని టాక్ నడుస్తోంది.
అటు అధినేత నిర్ణయానికి అడ్డు చెప్పలేక.. ఇటు ప్రజల వ్యతిరేకతను తప్పించుకోలేక గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రధాన భాగంగా ఉన్న మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేల పరిస్ధితి మరింత ఇబ్బందికరంగా ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిది సాధారణంగానే చెప్పింది చేసే నైజం కలిగిన వ్యక్తిత్వం. ఎన్నికల ముందు రాజధాని ఇక్కడి నుంచి తరలిపోదంటూ నియోజకవర్గ ప్రజలకు గట్టి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా జరుగుతుండడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
ఉండవల్లి, తాడేపల్లి మండలాల్లో ఉన్న సొంత సామాజికవర్గం నుంచి నిరసనలు వస్తుండటంతో వారికి ఏం సమాధానంలో చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారట. రాజధాని తరలిపోయినా మంగళగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ నియోజకవర్గ ప్రజలకు, కేడర్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందట. ఆమె స్ధానికంగా నియోజకవర్గంలో తిరిగే పరిస్ధితి లేకుండాపోయింది. తొలి నుంచి జగన్ రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రత్యక్షంగా సమర్ధిస్తూ ఉండటంతో స్ధానికులంతా శ్రీదేవిని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ కార్యక్రమాల్లో స్వేచ్ఛగా తిరగలేని వాతావరణంలో శ్రీదేవి ఉన్నారంటే పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి రాజధాని తరలింపు ప్రభావం గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రంగానే ఉందని చెప్పాలి. మరి ఈ వ్యతిరేక పరిస్ధితి నుంచి గట్టేక్కెందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారో వేచిచూడాలి.