Ys Jagan Security : మాజీ సీఎం జగన్ కి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి
కూటమి ప్రభుత్వం విధానాలతో మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని చెప్పారు.

YS JaganMohan Reddy
Ys Jagan Security : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మిథున్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్లిన జగన్ కు పోలీసులు రక్షణ కల్పించలేదన్నారు.
జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రతా వైఫల్యం తలెత్తిందన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఇటీవల జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయని లేఖలో ప్రస్తావించారు మిథున్ రెడ్డి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు అని అనుమానం వ్యక్తం చేశారాయన. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారు- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కూటమి ప్రభుత్వం విధానాలతో మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి కూటమి ప్రభుత్వం తెరలేపుతోందని ప్రధాని మోదీకి రాసిన లేఖలో మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
”గుంటూరు మిర్చి యార్డ్ కి వెళ్లి రైతులను కలిశారు జగన్. ధరలు ఎందుకు తగ్గాయి, వారు పడుతున్న ఇబ్బందులు, బాధలు ఏంటి అని తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేద్దామని జగన్ అక్కడికి వెళ్లారు. జగన్ కు పోలీసులు భద్రత కల్పించలేదు. యూనిఫామ్ లో ఉన్న ఒక్క కానిస్టేబుల్ కూడా అక్కడ లేరు. అవాంఛనీయ సంఘటనలు జరిగేలా ప్రయత్నం జరిగింది.
అందుకే, మేమంతా గవర్నర్ ని కలిసి జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం. జగన్ కు భద్రత విషయంలో లోపాలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం కావాలనే భద్రత కల్పించడం లేదని, జగన్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జగన్ కు కూటమి ప్రభుత్వం భద్రత కల్పించేలా గవర్నర్ ను మేము కోరడం జరిగింది. ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానని, ఎంక్వైరీ చేస్తానని గవర్నర్ చెప్పడం జరిగింది” అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.