డిక్లరేషన్ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి డిక్లరేషన్ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇస్తారా? అన్న ప్రశ్నకు తాను వివరణ మాత్రమే ఇచ్చానని అన్నారు. శ్రీవారి తిరుమలకు వచ్చే ఏ మతస్థులైనా స్వామివారిని దర్శించుకోవచ్చునని వైవీ సుబ్బారెడ్డి ఇదివరకే ప్రకటించారు.
దీనిపై ప్రతిపక్ష పార్టీ నేతలు, పలు సంఘాల నేతలు తప్పుబట్టడంతో వివాదం చెలరేగింది. ఇప్పుడు ఈ డిక్లరేషన్ వివాదంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అప్పట్లో సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదన్నారు.
ఇప్పుడు జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 23వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో సీఎం వైఎస్ జగన్ కూడా డిక్లరేషన్‌పై సంతకం చెయ్యరని చెప్పాను. ఎవరైనా డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనం చేసుకోవాలని చట్టంలో ఉందన్నారు. సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఎవరు డిక్లరేషన్‌పై సంతకం చెయ్యడం లేదు.
గుర్తించిన భక్తుల నుంచి మాత్రమే డిక్లరేషన్ తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో జగన్ పలు మార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఎప్పుడు డిక్లరేషన్ సమర్పించలేదు. ఈసారి కూడా ఆయన డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో తన మాటలను దయచేసి వక్రీకరించొద్దన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో వివాదాలు సృష్టించొద్దని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.