AP Politics : టీడీపీ, జనసేనకు షాక్ ఇచ్చిన నాయకులు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన కార్యకర్తలు

ఆమంచి స్వాములు నిర్ణయంతో గిద్దలూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

AP Politics : టీడీపీ, జనసేనకు షాక్ ఇచ్చిన నాయకులు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన కార్యకర్తలు

AP Politics : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ జనసేన రెబల్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్ల ఆమంచి స్వాములు ప్రకటించారు. కంభం పట్టణంలో నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు స్వాములు. ఉమ్మడి పార్టీ అభ్యర్ధిగా గిద్దలూరు సీటు ఆశించి భంగపడ్డారు స్వాములు. దీంతో అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఆమంచి స్వాములు.

తనకు గిద్దలూరు నుండి జనసేన అభ్యర్ధిగా టికెట్ కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు స్వాములు. అతి త్వరలో గిద్దలూరులో శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని వెల్లడించారు. ఆమంచి స్వాములు ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఆమంచి స్వాములు నిర్ణయంతో గిద్దలూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఇప్పటికే గిద్దలూరు ఉమ్మడి పార్టీల అభ్యర్ధిగా ముత్తుముల అశోక్ రెడ్డిని ప్రకటించింది టీడీపీ అదిష్టానం.

అనపర్తి టీడీపీలో అలజడి..
అటు.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. అనపర్తి నియోజకవర్గం స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందని తెలుస్తోంది. టీడీపీ మొదటి జాబితాలో అనపర్తి నియోజకవర్గం ఉంది. సీటును నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించారు చంద్రబాబు. ఇప్పుడు సడెన్ గా బీజేపీకి కేటాయిస్తున్నారని వస్తున్న ప్రచారంతో టీడీపీ శ్రేణుల్లో అలజడి మొదలైంది.

ప్రచారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనపర్తి సీటుపై స్పష్టమైన ప్రకటన ఇచ్చేవరకు ప్రచారం చేయమని నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని, కుటుంబసభ్యులను వెనక్కి పంపేశారు కార్యకర్తలు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు పార్టీకి సహకరించేది లేదని కార్యకర్తలు తేల్చి చెప్పారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి తెలుగుదేశం సీటు ఇవ్వకుంటే తెలుగుదేశంకి ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కార్యకర్తలు.

ఎస్ కోట టీడీపీలో భారీ కుదుపు..
విజయనగరం జిల్లా ఎస్ కోట టీడీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. టికెట్ ఆశించి భంగపడిన ఎన్ఆర్ఐ గొంప కృష్ణ అసంతృప్తి గళం విప్పారు. ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని ఆయన ప్రకటించారు. తన అనుచర వర్గంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి టికెట్ కేటాయించడంతో ఆయన మనస్తాపం చెందారు. కోళ్ల లలిత అవినీతిపరురాలు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read : ఆ 6 సీట్లను చంద్రబాబు ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? ఎందుకింత తర్జనభర్జన?