శంబంగి Vs బేబినాయన.. హోరాహోరీగా బొబ్బిలి సమరం

ప్రభుత్వ సానుకూల పవనాలతో గట్టెక్కుతామని వైసీపీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభిస్తుందని టీడీపీ ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ రెండు వాదనల్లో ఓటర్లు ఎవరి వాదనతో ఏకీభవిస్తారో..? ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠగా పెంచుతోంది.

శంబంగి Vs బేబినాయన.. హోరాహోరీగా బొబ్బిలి సమరం

Bobbili Big Fight

Sambangi Vs Baby Nayana : చారిత్రక బొబ్బిలిలో రాజకీయ యుద్ధం ఎలా సాగుతోంది.. బొబ్బిలి రాజుల అడ్డాలో జెండా పాతిన వైసీపీ.. వన్స్‌మోర్‌ అంటూ మళ్లీ జోరు చూపిస్తుందా? వరుసగా మూడుసార్లు గెలిచి తమ సత్తా చాటిన బొబ్బిలి రాజులు గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటారా? పౌరుషానికి.. ప్రతిష్ఠకు మారుపేరైన బొబ్బిలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయం ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏది?

టీడీపీ అభ్యర్థిగా బొబ్బిలి యువరాజు..
బొబ్బిలి పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చేది అలనాటి యుద్ధమే. తెలుగు నేలపై ఎన్నో రాజ్యాలు, యుద్ధాలు జరిగినా బొబ్బిలి సంస్థానానికి.. బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకే ఒక్కరోజు జరిగిన బొబ్బిలి యుద్ధం… రెండు శతాబ్దాలు దాటినా ప్రజల మదిలో గుర్తిండిపోయింది. పౌరుషానికి ప్రతీకగా చెప్పే బొబ్బిలి యుద్ధంలో సైనికులతోపాటు స్థానిక ప్రజలు చూపించిన పోరాట తెగువే ఆ యుద్ధానికి.. బొబ్బిలి సంస్థానికి అంతటి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఇప్పుడు కూడా బొబ్బిలి వేదికగా జరిగే రాజకీయ యుద్ధం రక్తి కట్టిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా బొబ్బిలి యువరాజు పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.

బొబ్బిలి సంస్థానాన్ని స్థాపించిన పెదరాయుడు తన కోటకు పెద్దపులిగా పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. పెద్దపులి కాస్త కాలక్రమంలో బెబ్బులి.. బొబ్బిలిగా మారింది. అందుకే సాహసాలకు బొబ్బిలి ప్రతీకగా చెబుతారు. ఇక బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు హోరాహోరీ సమరమే జరుగుతోంది. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర ఉన్న బొబ్బిలి రాజులు.. స్థానిక రాజకీయాలు 2004లోనే స్టార్ట్‌ చేశారు. ప్రస్తుతం బొబ్బిలి సంస్థానం నుంచి రాజకీయాలు చేస్తున్న సుజయకృష్ణరంగారావు 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

సుజయను గెలిపించింది బేబినాయనే..
ఆ తర్వాత 2009, 2014ల్లోనూ వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన సుజయకృష్ణరంగారావు.. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, సీనియర్‌ నేత శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చేతిలో పరాభవం పాలయ్యారు. ఇక ఓటమి తర్వాత బొబ్బిలి రాజకీయాల నుంచి తప్పుకున్న సుజయకృష్ణ రంగారావు.. తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు, యువరాజు బేబినాయనకు అప్పగించారు. వాస్తవానికి ఎమ్మెల్యేగా సుజయ గెలిచినా.. ఆయనను గెలిపించేది బేబినాయనే అని చెబుతుంటారు. దీంతో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న బేబీనాయన.. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అధికార పార్టీని ఢీకొడుతున్నారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు..
ఒకవైపు యువరాజు, మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే తలపడుతున్న బొబ్బిలిలో రాజకీయ యుద్ధం చారిత్రక యుద్ధాన్ని తలపిస్తోందంటున్నారు. ఎత్తుకు పైఎత్తులతో.. వ్యూహాలతో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తాను మళ్లీ గెలుస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన శంబంగి.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

మరోసారి గెలుపుపై శంబంగి ధీమా..
2004లో బొబ్బిలి రాజుల హవా మొదలైన తర్వాత.. వారి స్పీడుకు బ్రేకులు వేసే వారే లేనట్లు రాజకీయం సాగింది. కానీ, గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ టికెట్‌ దక్కించుకున్న శంబంగి.. బొబ్బిలి రాజులకు ఝలక్‌ ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లోనూ తనదే విజయం అంటున్నారు శంబంగి. గత ఐదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని.. సాగునీటి సమస్యలు తీర్చానని చెబుతున్నారు ఎమ్మెల్యే శంబంగి.. ప్రజలతో సంతోషంగా ఉన్నారని… మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఖాయమంటున్నారు.

తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి..
ఇక ఇన్నాళ్లు తెరవెనుక చక్రం తిప్పిన యువరాజు బేబీనాయన.. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా స్థానిక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న బేబినాయన.. 2004, 2009, 2014 ఎన్నికల్లో బొబ్బిలి ఎమ్మెల్యేగా సుజయకృష్ణ రంగారావు గెలుపొందటానికి తీవ్రంగా కృషి చేశారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన సుజయకృష్ణ రంగారావు.. బొబ్బిలి నియోజకవర్గాన్ని తన సోదరుడికి వదిలేశారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. బొబ్బిలి కోటలో మళ్లీ పాగా వేస్తామని చెబుతున్నారు బేబీనాయన.

బొత్స చాణక్యంతో రాజులపై ఘన విజయం..
బొబ్బిలి మున్సిపాలిటీతోపాటు రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. బొబ్బిలికి 14సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ పార్టీ ఏడుసార్లు, టీడీపీ మూడుసార్లు, వైసీపీ రెండుసార్లు గెలిచాయి. ఇక మూడోసారి గెలిచేందుకు వైసీపీ.. తమ కోటను పదిలం చేసుకోడానికి టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో వైసీపీలో కొనసాగిన బొబ్బిలి రాజులు.. జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి బొత్సతో విభేదాల కారణంగా టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో బొత్స చాణక్యంతో రాజులపై నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన శంబంగిని పోటీలో పెట్టి ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా బొత్స సలహాలు, సూచనలతో వైసీపీ కదులుతుండగా, టీడీపీలో బేబినాయనే అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు.

బేబీనాయన ఒంటరి పోరాటం..
గత స్థానిక ఎన్నికల్లోనూ మెజార్టీ పంచాయితీలు, ఎంపీటీసీ స్థానాలను గెల్చుకున్న వైసీపీ…. ప్రస్తుతం దూకుడు చూపుతుండగా, తనదైన రాజకీయ వ్యూహాలతో ఆ పార్టీకి చెక్‌ చెబుతున్నారు బేబీనాయన. ఐతే గత ఐదేళ్లలో చాలామంది సీనియర్‌ నేతలు టీడీపీని వీడటంతో బేబీనాయన ఓ విధంగా ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తోందంటున్నారు. అంతేకాకుండా ఆయన చుట్టూ ఉండే కోటరీకే పెద్దపీట వేస్తుంటారని.. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పనిచేస్తోన్న కార్యకర్తలను అంతగా పట్టించుకోరన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

సంక్షేమ పథకాలు వర్సెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు
మరోవైపు బొబ్బిలి కోట గుమ్మం దాటడం సామాన్యులకు కష్టమేనన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి అధికార, ప్రతిపక్షాల మధ్య తారస్థాయి పోరాటం జరుగుతోంది. ప్రభుత్వ సానుకూల పవనాలతో గట్టెక్కుతామని వైసీపీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభిస్తుందని టీడీపీ ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ రెండు వాదనల్లో ఓటర్లు ఎవరి వాదనతో ఏకీభవిస్తారో..? ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠగా పెంచుతోంది.

Also Read : టీడీపీ రికార్డ్‌ సృష్టిస్తుందా? వైసీపీ హ్యాట్రిక్‌ కొడుతుందా? కొండారెడ్డి బురుజుపై ఎగిరే జెండా ఏది