Anakapalli : అనకాపల్లిపై ఎందుకింత సస్పెన్స్? అసలు సీఎం జగన్ వ్యూహం ఏంటి?

ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి సవాల్‌గా మారింది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పార్టీ.

Anakapalli : అనకాపల్లిపై ఎందుకింత సస్పెన్స్? అసలు సీఎం జగన్ వ్యూహం ఏంటి?

Anakapalli Ycp Mp Candidate Pending

Anakapalli : 175 అసెంబ్లీ.. 24 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ… ఒక్క అనకాపల్లి నియోజకవర్గాన్నే ఎందుకు పెండింగ్‌ పెట్టింది? అక్కడ పోటీ చేసే అభ్యర్థే లేరా? లేక వ్యూహాత్మకంగానే ఆ నియోజకవర్గాన్ని వెనక్కి పెట్టారా? అసలు అనకాపల్లి బరిలో దిగే ఫ్యాన్‌ పార్టీ నేత ఎవరు? అధిష్టానం ఎవరెవరి పేర్లు పరిశీలిస్తోంది? సిట్టింగ్‌ ఎంపీకి మళ్లీ చాన్స్‌ ఎందుకు ఇవ్వలేదు?

బీజేపీ నుంచి సీఎం రమేశ్ లేదా జీవీఎల్ పోటీ?
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై నాలుగు నెలల ముందు నుంచే కసరత్తు చేసిన అధికార వైసీపీ… రాష్ట్రంలోని ఒక్క అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని మాత్రమే పెండింగ్‌లో పెట్టేసింది. మొత్తం 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్‌ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన పార్టీ… అనకాపల్లిని పెండింగ్‌లో పెట్టడానికి ఎటువంటి కారణాలు చూపలేదు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న ఈ స్థానాన్ని మళ్లీ ఎలాగైనా నిలుపుకోవాలని భావిస్తున్న సీఎం జగన్‌… అనకాపల్లిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారంటున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ నేతలు సీఎం రమేశ్‌ లేదా జీవిఎల్‌ నరసింహారావు పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఎవరవుతారనేది ఉత్కంఠ పెంచుతోంది.

ఆ కారణంతో సిట్టింగ్ ఎంపీకి టికెట్ నిరాకరణ..
గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచిన సిట్టింగ్‌ ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతికి ఈసారి టికెట్‌ నిరాకరించింది వైసీపీ అధిష్టానం. రూపాయి డాక్టర్‌గా, లక్ష ప్రసవాలు చేసిన డాక్టరమ్మగా అనకాపల్లి ప్రాంతంలో పేరు తెచ్చుకున్న డాక్టర్‌ సత్యవతి.. గత ఎన్నికల్లో సొంత చరిష్మాతోపాటు వైసీపీ హవాతో సునాయాసంగా గెలుపొందారు. ఐతే ఈసారి ఎన్నికల్లో ఖర్చు తట్టుకోలేరనే ఆలోచనతోపాటు ప్రజల్లో పెద్దగా సానుకూలత లేకపోవడంతో సిట్టింగ్‌ ఎంపీని పక్కకు తప్పించింది వైసీపీ. ఎంపీ సత్యవతి స్థానంలో మంత్రి అమర్‌నాథ్‌, ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ వంటి వారి పేర్లు వినిపించినప్పటికీ, వారికి గాజువాక, చోడవరం సీట్లను కన్ఫార్మ్‌ చేసింది పార్టీ. దీంతో ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్నది సస్పెన్స్‌కు దారితీస్తోంది.

ఖర్చులో ఆయనకు పోటీని తట్టుకునే నేత కోసం వైసీపీ అన్వేషణ..
సిట్టింగ్‌ ఎంపీ సత్యవతిని మళ్లీ కొనసాగించే పరిస్థితి లేదని గతేడాది డిసెంబర్‌ నుంచి ప్రచారం జరిగింది. ఇదే సమయంలో విశాఖ డెయిరీ డైరెక్టర్‌ పీలా రమాకుమారి పేరు వినిపించింది. విశాఖ డెయిరీ రైతులతో మంచి సంబంధాలు ఉండటంతో రమాకుమారి అభ్యర్థిత్వంపై హైకమాండ్‌ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఐతే అనకాపల్లి నుంచి జనసేన నేత, సినీనటుడు నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారంతో.. ఆయనకు దీటైన నేత కోసం రమాకుమారి పేరును వెనక్కి పెట్టింది వైసీపీ.. ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ కూటమితో జతకలవడం, పొత్తుల్లో అనకాపల్లిని బీజేపీకి కేటాయించడంతో ఇక్కడి నుంచి బీజేపీ నేతలు సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో సీఎం రమేశ్‌కు ఆర్థిక బలం ఎక్కువగా ఉండటంతో… ఖర్చులో ఆయనకు పోటీని తట్టుకునే నేత కోసం అన్వేషిస్తోంది వైసీపీ.

పరిశీలనలో ముత్యాలనాయుడి పేరు..
ఉత్తరాంధ్ర ప్రాంతంలో డబ్బు ప్రభావం మిగిలిన ప్రాంతాలకంటే తక్కువగా ఉంటుంది. కానీ, రాయలసీమకు చెందిన నేతలు అనకాపల్లిలో దిగుమతి అయితే…. ఆ రేంజ్‌లో ఖర్చు చేయడం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలకు అసాధ్యమనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో అన్ని రకాలుగా ఆలోచిస్తున్న వైసీపీ… ఆర్థికంగా పటిష్టంగా ఉన్నవారి కోసం జల్లెడ పట్టి వెతుకుతోంది. ఇదే సమయంలో డబ్బును సమర్థతతో ఓడించొచ్చనే ఫిలాసఫీతో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మాడుగుల నుంచి ఎన్నికైన ముత్యాలనాయుడు… అనకాపల్లి జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన నేత. దీంతో ఆయనను లోక్‌సభ బరిలో దింపాలనే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

సవాల్ గా మారిన అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ..
ఐతే ఇప్పటికే మాడుగుల అభ్యర్థిగా ముత్యాలనాయుడు పేరు ఖరారు చేసింది వైసీపీ… ఆయనను అనకాపల్లి బరిలోకి దించితే… మాడుగులకు కొత్త అభ్యర్థిని వెతకాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఎంపీగా కన్నా, ఎమ్మెల్యేగా పోటీకే ముత్యాలనాయుడు మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి సవాల్‌గా మారింది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పార్టీ. మొత్తానికి అనకాపల్లి అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్‌ మరికొన్నాళ్లు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read : టీడీపీ చరిత్రలోనే తొలిసారి.. దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?