పరమశివుడికే అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి.. అమ్మవారి అలంకరణ విశిష్టత గురించి తెలుసా?
అన్నపూర్ణను తెల్లని పుష్పాలతో కొలుస్తారు. దేవతకు ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు.

Devi Navaratrulu 2025: ఆకలితో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెడితే “అన్నపూర్ణాదేవిలా అన్నం పెట్టావు తల్లీ” అని అంటారు. నవరాత్రులలో ఇంద్రకీలాద్రిలో మూడో రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు.
ఇలా చేస్తే అన్నానికి లోటు ఉండదని చెబుతుంటారు. అలాగే, తెలివి, వాక్చాతుర్యం, సమృద్ధి, సంపద వంటివి వస్తాయని విశ్వసిస్తారు. అన్నపూర్ణకు కాశీలో శివుడితో పాటు రాణిగా పూజలు చేస్తారు.
అన్నపూర్ణాదేవి అంటే అన్నాన్ని ప్రసాదించే దేవత అని అర్థంగా మనం చూస్తాం. అమ్మవారిని పూజిస్తే జ్ఞానం, శ్రేయస్సు కూడా కలుగుతాయి. (Devi Navaratrulu 2025)
అన్నపూర్ణాదేవి అలంకరణ విశిష్టత
సకల ప్రాణికోటికి అన్నమే ఆధారమని అంటుంటాం. అన్నపూర్ణాదేవి గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు. అన్నపూర్ణను తెల్లని పుష్పాలతో కొలుస్తారు. దేవతకు ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు.
శివుడు పార్వతీదేవితో ఒకసారి “ప్రపంచమంతా మాయ.. అన్నం కూడా మాయ” అని అన్నాడు. ఆ మాటలు పార్వతీదేవిని నచ్చక కాశీని విడిచిపెట్టింది. ఆ ప్రాంతంలో కరవు రావడంతో ప్రజలు అన్నం దొరక్క అల్లాడిపోయారు.
దీంతో పార్వతీదేవి తిరిగి కాశీకి వచ్చి భక్తులను కరుణించింది. శివుడు ఆమె దగ్గరకు వెళ్లి తన భిక్షపాత్రను చూపించి పార్వతిని “అన్నం మాయ” అనడం సరికాదని తెలుసుకున్నాడు. దీంతో పార్వతీదేవి సంతోషంగా శివుడికి భోజనం పెట్టింది.