Tirumala Festival Calendar March 2025 : కలియుగ ప్రతక్ష దైవం కొలువుదీరిన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారు. స్వామి వారిని దర్శించుకుని పులకించి పోతారు. అలాగే స్వామి వారి ఉత్సవాలలో పాల్గొని తరించిపోతారు. తిరుమలలో ప్రతి నెల విశేష ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ మార్చి నెలలో తిరుమలలో జరిగే శ్రీవారి ఉత్సవాలు ఏవేవి, ఏ రోజున ఏం జరుగుతాయి అని తెలుసుకోవాలనే ఆసక్తి భక్తుల్లో ఉంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమల, తిరుపతి దేవస్థానాలలో 2025 మార్చిలో జరిగే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీవారి ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అంచనా వేసింది.
Also Read : స్టాక్ మార్కెట్లు ఢమాల్.. బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..
మార్చి 7న తిరుక్కచినంబి సాత్తుమొరతో ఈ నెలలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తర్వాత తిరుమల శ్రీవారి తెప్పోత్సవం, ప్రధాన వార్షిక తెప్పోత్సవం మార్చి 9న ప్రారంభమై మార్చి 13న ముగుస్తుంది. స్వామి పుష్కరిణి ఆలయ ట్యాంక్ వద్ద నిర్వహించే ఈ ఆచారం భక్తులకు ప్రధాన ఆకర్షణ.
మార్చి 10న మహా ఏకాదశి. ఆ రోజున భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టమైన కుమారధార తీర్థ ముక్కోటి.. మార్చి 14న జరగనుంది. మార్చి 25 సర్వ ఏకాదశి. ఉపవాసం, ప్రార్థనలకు ముఖ్యమైన రోజు. మార్చి 28న అన్నమాచార్య వర్ధంతి. మార్చి 30న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
తిరుచానూరు ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలు..
* తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చిలో పలు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.
* తిరుచ్చి ఉత్సవం నాలుగు శుక్రవారాలు- మార్చి 7, 14, 21, 28 తేదీలలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
* మార్చి 24న ఉత్తరా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక ఊరేగింపు. సాయంత్రం 6:45 గంటలకు నిర్వహించబడుతుంది.
* ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ వీధుల్లో పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు.
* మార్చి 30న సాయంత్రం 6 గంటలకు ఉగాదిని పురస్కరించుకుని ప్రత్యేక పుష్ప పల్లకి సేవ నిర్వహిస్తారు.
Also Read : ఏపీ ప్రజలకు కొత్త పథకం.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. ఎప్పటినుంచంటే?
* శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో శ్రీ సూర్య జయంతి ఉత్సవం మార్చి 18 న సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది.
* ఇది సూర్య భగవానుడి భక్తులకు ముఖ్యమైన కార్యక్రమం.
* శ్రీ సుందర రాజ స్వామి ఆలయంలో తిరుచ్చి ఉత్సవం మార్చి 2 సాయంత్రం 6 గంటలకు నిర్వహించబడుతుంది.
ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా. యాత్రికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, వారి సందర్శన సమయంలో ఆలయ మార్గదర్శకాలను పాటించాలని టీటీడీ కోరింది. మరోవైపు భక్తులకు సజావుగా దర్శనం కలిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు.