Bathukamma 2024: ఇవాళ ముద్దపప్పు బతుకమ్మ.. నైవేద్యం ఏమిటి.. ఎలా పూజిస్తారంటే?
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాదిస్తు అత్యంత వైభవంగా పూల పండుగను తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు.

muddappu batukamma
Bathukamma Celebrations 2024: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాదిస్తు అత్యంత వైభవంగా పూల పండుగను తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు. ఆశ్వీయుజ శుద్ద అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబురాలు తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొమ్మిదో రోజుల్లో రకరకాల నైవేద్యాలను గౌరమ్మకి పెడుతూ.. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు. మరోవైపు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతున్నారు. దీంతో పట్టణాలు, పల్లెల్లో బతుకమ్మ వేడుకల కోలాహలం నెలకొంది.
Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఉద్యోగం విషయంలో జాగ్రత్త..!
ఇవాళ (శక్రవారం) బతుకమ్మ వేడుకల్లో మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మను జరుపుకోనున్నారు. ఈరోజు ఎక్కువగా చిన్న పిల్లలు బతుకమ్మను జరుపుకోనున్నారు. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తూ గౌరమ్మను పూజిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. మరోవైపు మూడు ఎత్తుల్లో పూలను పేర్చి, శిఖరం మీద గౌరమ్మను ఉంచుతారు. చామంతి, మందారం తదితర పూలను ఉపయోగిస్తారు.
తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు..
1. ఎంగిలి పూల బతుకమ్మ : నువ్వులు, బియ్యం పిండి, నూకలు కల్పి నైవేద్యంగా సమర్పించాలి.
2. అటుకుల బతుకమ్మ : సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి.
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి.
4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.
5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించాలి.
6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
7. వేపకాయల బతుకమ్మ : బియ్యం పిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి.
8. వెన్న ముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి.
9. సద్దుల బతుకమ్మ : పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి.