Adani Buys DB Power : అదానీ గ్రూప్ దూకుడు.. రూ.7వేల కోట్లకు DB పవర్‌ కొనుగోలు

అదానీ గ్రూప్‌ దుమ్మురేపుతోంది. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటూ అందనంత ఎత్తుకు ఎదుగుతోంది. తాజాగా మరో సంస్థను కొనుగోలు చేసింది. డీబీ పవర్‌ను రూ.7,017 కోట్లకు కొనుగోలు చేసింది.

Adani Buys DB Power : అదానీ గ్రూప్ దూకుడు.. రూ.7వేల కోట్లకు DB పవర్‌ కొనుగోలు

Updated On : August 19, 2022 / 10:04 PM IST

Adani Buys DB Power : అదానీ గ్రూప్‌ దుమ్మురేపుతోంది. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటూ అందనంత ఎత్తుకు ఎదుగుతోంది. తాజాగా మరో సంస్థను కొనుగోలు చేసింది. డీబీ పవర్‌ను రూ.7,017 కోట్లకు కొనుగోలు చేసింది.

డీబీ పవర్‌ ఛత్తీస్‌గఢ్‌లో రెండు 600 మెగావాట్‌ సామర్థ్యం గల థర్మల్‌ పవర్‌ యూనిట్లను కలిగి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్‌ పంపిణీపై పట్టు సాధించాలన్న అదానీ గ్రూప్‌ కోరికకు ఈ టేకోవర్‌ సాయపడనుంది. ఈ కంపెనీలో నూరుశాతం వాటాలను అదానీ పవర్ కొనుగోలు చేయనుంది.

డీబీ పవర్‌ కొనుగోలు అంశాన్ని అదానీ పవర్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. అయితే ఈ ఎక్విజిషన్‌కు కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు ఎంవోయు అమల్లో ఉండనుంది. అంటే ఈ లోగానే టే కోవర్ ప్రక్రియ పూర్తికావచ్చు.

డీబీ పవర్‌ గత ఆర్థిక సంవత్సరంలో 3వేల 488 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఇది డెలిగెంట్‌ పవర్‌కు అనుబంధ సంస్థ. 2006లో డీబీ పవర్‌ పేరుతో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. డీబీ టేకోవర్‌ వార్తలతో అదానీ పవర్‌ షేరు పరుగులు పెట్టింది. రూ.12.80 పెరిగి రూ.412 వద్ద ముగిసింది.

మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసినా అదానీ పవర్‌ మాత్రం 3.2శాతం పెరిగింది. అంతేకాదు 52వారాల గరిష్ఠస్థాయి రూ.419ని టచ్‌ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అదానీ పవర్‌ లాభం 1,619శాతం పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.278కోట్ల లాభం రాగా ఈసారి ఆ నికర లాభం ఏకంగా రూ.4,780 కోట్లుగా నమోదైంది.