Budvel Land: బుద్వేల్ పై అందరి ఫోకస్.. అత్యాధునిక మౌలిక వసతులతో లేఅవుట్
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 100 ఎకరాల విస్తీర్ణంలో 14 ప్లాట్లు ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో లేఅవుట్ను అభివృద్ధి చేశారు.

Budvel Land Aution
Budvel Land Aution: గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) నలువైపులా విస్తరిస్తోంది. నగరం పరిసరాలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలోనే భాగ్యనగరానికి దక్షిణాన ఉన్న బుద్వేల్ భారీ నివాస ప్రాజెక్టులకు కేరాఫ్ కాబోతోంది. బుద్వేల్లో వంద ఎకరాలను ఈ – వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ (HMDA) సిద్ధమైంది. కోకపేట్ నియోపోలిస్ (kokapet neopolis) వేలానికి మంచి ఆదరణ రావడంతో.. ఇప్పుడు బుద్వేల్ పై అందరి ఫోకస్ పడింది.
హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే మౌలిక వసతుల పరంగా కనీవినీ ఎరుగని రీతిలో డెవలప్ అయిన గ్రేటర్ సిటీ.. శివారు ప్రాంతాల్లో సైతం విస్తరిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో భాగ్యనగరం చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లకు ప్రజలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కోకపేట్ నియోపోలిస్లో ఎకరం రూ.100 కోట్లకు అమ్ముడవ్వటం దీనికి నిదర్శనం. ఇప్పుడు బుద్వేల్లో మరో వంద ఎకరాల భూమి వేలానికి హెచ్ఎండీఏ ప్రకటన ఇవ్వడంతో క్రేజ్ మరింత పెరిగింది.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 100 ఎకరాల విస్తీర్ణంలో 14 ప్లాట్లు ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో లేఅవుట్ను అభివృద్ధి చేశారు. 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు విస్తీర్ణంతో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 100 శాతం ఎటువంటి చిక్కులు లేని క్లియర్ టైటిల్ ఉన్న ప్రభుత్వ భూమి కావడం.. బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనువైన ప్రాంతం కావడంతో బుద్వేల్పై అందరి దృష్టి పడింది. 36 మీటర్లు, 45 మీటర్ల రోడ్లను ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్ నుంచి 15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కు, 15 నిమిషాల్లో నియోపోలిస్ కు చేరుకోవచ్చు. కోకపేట్ నియోపోలిస్లోని మౌలిక వసతులకు సమానంగా ఇక్కడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోలైన్ మార్గంలోనే బుద్వేల్ లేఅవుట్ ఉండటం.. ఔటర్ రింగ్ రోడ్డుకు చక్కటి అనుసంధానం కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
Also Read: అందరి దృష్టి కోకాపేటపైనే.. అసలు నియోపోలిస్ అంటే అర్థం ఏంటి?
బుద్వేల్ లేఅవుట్ రిజిస్ట్రేషన్కు ఈ నెల 8 ఆఖరు తేదీ. ఈ నెల 9వ తేదీ లోపు డిపాజిట్ చెల్లించాలి. ఈ నెల 10న వేలం జరగనుంది. ఈ నెల 10వ తేదీన రెండు సెషన్లలో వేలం పాట జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 1, 2, 4, 5, 8, 9, 10 నెంబరు ప్లాట్లకు వేలం వేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 11, 12, 13,14, 15, 16, 17 నెంబరు ప్లాట్లకు వేలం జరగనుంది. ఒక్కో ప్లాట్ నిర్దేశిత ధర ఎకరాకు రూ.20 కోట్లు. కనీస బిడ్ పెంపుదల రూ.25 లక్షలుగా ఉంది.
Also Read: కోకాపేట మీమ్స్.. అక్కడ ఒక్క అడుగు భూమున్నా చాలంటూ జోక్స్.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమర్స్
బుద్వేల్ బెంగళూరు జాతీయ రహదారిపై ఉండటంతో కనెక్టివిటీకి ఇబ్బంది లేదు. అటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఇటు ఐటీ హబ్, మరోవైపు ఎలక్ట్రానిక్ సిటీ, దగ్గర్లోనే శ్రీశైలం హైవే.. ఇలా బుద్వేల్ అన్ని విధాలుగా అందరికి అందుబాటులో ఉండే ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఓటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉండటంతో పాటు పాటు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరిస్తుండటం కలిసివస్తుంది. ఇక ఉపాధి, విద్యా, ఉద్యోగ అవకాశాలు ఉండటంతో మధ్య తరగతి వారికి నివాస ప్రాంతంగా అందుబాటులోకి వస్తుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.