అమెరికా గెంటేస్తోంది.. ఇప్పుడు పనిచేస్తూ జాబ్ చేసుకునేలా వీసాలిచ్చే దేశాలపై ఓ లుక్కేయండి..

అమెరికాపై చాలా మంది భారతీయులు ఆశలు వదులుకుంటున్నారు.

అమెరికా గెంటేస్తోంది.. ఇప్పుడు పనిచేస్తూ జాబ్ చేసుకునేలా వీసాలిచ్చే దేశాలపై ఓ లుక్కేయండి..

Updated On : February 16, 2025 / 2:27 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా తమ దేశంలోని అక్రమ వలసదారులను తిరిగి పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అమెరికా రెండు విమానాల్లో భారతీయులను భారత్‌కు పంపింది.

మరో విమానం కూడా ఇవాళ భారత్‌లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగాలు చేయాలంటేనే భారతీయ విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన వస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఇతర దేశాల వైపు భారతీయులు చూస్తున్నారు. పలు దేశాలు భారతీయ పౌరులకు విద్య, ఉద్యోగ వీసాలు రెండింటినీ పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అలాంటి దేశాల గురించి తెలుసుకుందాం.

Also Read: వామ్మో.. బంగారంపై పెట్టుబడి ఎన్ని కోట్లాది రూపాయల లాభాలను తెచ్చిపెట్టిందంటే? ఈ ఒక్క ఉదాహరణ చాలు..

కెనడా
అమెరికా తర్వాత చాలా మంది భారత విద్యార్థులు కెనడాలో చదువు, ఉద్యోగంపై ఆసక్తి కనబర్చుతారు. 2023 నాటికి దాదాపు 3,19,000 మంది భారతీయ పౌరులు కెనడియన్ సంస్థలలో చేరారు. కెనడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ (పీజీడబ్ల్యూపీ) ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. గ్రాడ్యుయేట్లు తమ చదువు పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల పాటు కెనడాలో పని చేయడానికి వీలు కల్పిస్తుంది.

ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో కనీసం రెండు సంవత్సరాల చదువు/అధ్యయనం పూర్తి చేసిన విద్యార్థులకు ఆ దేశ సర్కారు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలను (సబ్‌క్లాస్ 485) అందిస్తుంది. ఈ వీసా గ్రాడ్యుయేట్లు వారి అర్హతలను బట్టి 18 నెలల నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఆస్ట్రేలియాలో పని చేయడానికి అనుమతిస్తుంది.

యునైటెడ్ కింగ్‌డమ్
యూకే గ్రాడ్యుయేట్ రూట్ వీసాను అందిస్తుంది. దీని ద్వారా అంతర్జాతీయ విద్యార్థులు యూకే వర్సిటీల్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల వరకు అక్కడ ఉండి పని చేయడానికి లేదా ఉద్యోగం కోసం సెర్చ్‌ చేసుకోవడానికి వీలు ఉంటుంది. పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్లు ఈ వ్యవధిని మూడు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. దీంతో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందడానికి, దీర్ఘకాలికంగా ఆ దేశంలో ఉండే వీసాలను పొందేందుకు వీలు కూడా కలుగుతుంది.

జర్మనీ
జర్మనీకి 2023లో భారతీయ విద్యార్థులు 25,000 మంది కంటే ఎక్కువ మంది వెళ్లారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం చూసుకోవడానికి
18 నెలల అనుమతిని అందిస్తుంది. ఉద్యోగం పొందిన తర్వాత గ్రాడ్యుయేట్లు ఈయూ బ్లూ కార్డ్ లేదా ఉపాధి కోసం నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

న్యూజిలాండ్
న్యూజిలాండ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసాను అందిస్తుంది. ఇది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు వారి అర్హతలు, అధ్యయన ప్రాంతాన్ని బట్టి ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు దేశంలో పని చేయడానికి అనుమతిస్తుంది.

సింగపూర్
సింగపూర్‌లో వర్క్ వీసా నిబంధనలు సులభతరంగానే ఉంటాయి. వివిధ రంగాల భారతీయ నిపుణులకు సింగపూర్‌ ఆహ్వానం పలుకుతుంది. సింగపూర్ విద్యా సంస్థల నుంచి పట్టభద్రులైన అంతర్జాతీయ విద్యార్థులు దీర్ఘకాలిక విజిట్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ఉపాధి కోసం ఒక సంవత్సరం వరకు దేశంలో ఉండే వీలుంది. ఉద్యోగం పొందిన తర్వాత వారి జీతం, అర్హతలను బట్టి వారు ఉపాధి పాస్ లేదా ఎస్‌ పాస్ పొందవచ్చు.