Gold Prices: బంగారం ధరలు పెరగడంతో ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? మీరూ ఇలాగే చేస్తున్నారా?

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ఏం చెప్పిందో తెలుసా?

Gold Prices: బంగారం ధరలు పెరగడంతో ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? మీరూ ఇలాగే చేస్తున్నారా?

Updated On : March 9, 2025 / 7:39 PM IST

భారత్‌లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు కొత్తగా బంగారం కొనుగోలు చేయడం కంటే పాత బంగారు ఆభరణాలను మార్పిడి చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తెలిపింది. తన తాజా “ఇండియా గోల్డ్ మార్కెట్” అప్‌డేట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. ఇంకా ఏమి చెప్పిందంటే..

బంగారం ధరలు కొత్త గరిష్ఠ స్థాయిని దాటి పెరుగుతుండటంతో, చాలా మంది వినియోగదారులు పాత బంగారాన్ని విక్రయించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలు రిటైల్ జ్యుయెలరీ డిమాండ్‌ను తగ్గించాయి. 2025 జనవరిలో బంగారం దిగుమతులు కూడా తగ్గడాన్ని డిమాండ్ తగ్గిన సంకేతంగా భావించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది.

బంగారం ధరలు పెరగడం వల్ల వినియోగదారులు కొత్తగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం తగ్గించారు. ఫలితంగా, చిన్న లేదా పెద్ద జ్యుయెలరీ దుకాణాలు కొత్తగా స్టాక్ తెప్పించడానికి వెనుకంజ వేస్తున్నాయి. రిటైలర్లు ఎక్కువగా అమ్మకాలు జరపలేకపోతే, వారు కొత్త బంగారం కొనడానికి సిద్ధంగా ఉండరు.

ఎందుకంటే, కొత్త స్టాక్ తెప్పించాలంటే తయారీదారులకు ముందస్తుగా చెల్లింపులు చేయాలి. అయితే, అమ్మకాలు మందగించడంతో రిటైలర్ల దగ్గర తగినంత నగదు ఉండడం కష్టమవుతోందని ‘వరల్డ్ గోల్డ్ కౌన్సిల్’ చెప్పింది. అలాగే, డిసెంబర్ నుంచి దేశీయ బంగారం ధరలు అంతర్జాతీయ ధరలకు తక్కువగా ట్రేడవుతున్నాయి.

జ్యుయెలరీ డిమాండ్ తగ్గినప్పటికీ, బంగారు బార్లు, నాణేలపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గలేదు. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు భౌతిక బంగారం కొనుగోలు చేయడం కంటే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో (ETF) పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. 2025లో గోల్డ్ ఈటీఎఫ్‌లపై భారీ ఆసక్తి కనబర్చుతున్నారు.

స్టాక్ మార్కెట్ అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారం ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడి చేస్తూ డైవర్సిఫై చేసుకుంటున్నారు. వివాహాల వేళ కూడా బంగారం కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది నవంబర్‌లో ధరలు తగ్గినప్పుడు వినియోగదారులు ముందుగా కొనుగోలు చేసి ఉండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండటంతో జ్యుయెలరీ డిమాండ్ మరింత ఒత్తిడికి గురవుతుందని అంచనా.

“ఆర్థిక సంవత్సరాంతంలోని పన్ను చెల్లింపులు, పెట్టుబడి ప్రణాళికలు వినియోగదారుల ఖర్చులను పరిమితం చేసే అవకాశం ఉంది, ఇది మరింతగా డిమాండ్‌ను ప్రభావితం చేస్తుంది” అని WGC నివేదిక పేర్కొంది.