డౌన్‌లోడ్ చేశారా : అమెజాన్ Fire TVపై Apple TV యాప్

అమెజాన్ ఫైర్ స్టిక్ యూజర్లకు గుడ్ న్యూస్. ఫైర్ టీవీ ప్రొడక్టులపై కూడా Apple TV యాప్ లాంచ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 60కు పైగా దేశాల్లోని అమెజాన్ ఫైర్ టీవీ యూజర్లు ఆపిల్ టీవీ యాప్ డౌన్ లోడ్ చేసుకుని తమ ఫైర్ టీవీ ప్రొడక్టులపై యాక్సస్ చేసుకోవచ్చునని అమెజాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇకపై ఆపిల్ టీవీ యాప్ ద్వారా అమెజాన్ ఫైర్ స్టిక్ యూజర్లు.. అన్ని మూవీలు, టీవీ షోలు, ఛానళ్లను సబ్ స్ర్కైబ్ చేసుకుని వీక్షించవచ్చు.
వచ్చే నవంబర్ 1 నుంచి ఫైర్ టీవీ యూజర్లు ఆపిల్ టీవీ ప్లస్ సబ్ స్ర్కిప్షన్ కూడా యాక్సస్ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. ఆపిల్ టీవీ యాప్ ప్లాట్ ఫాంపై అందించే అన్ని ఒరిజినల్ షోలు, మూవీలతో పాటు మార్నింగ్ షో, డికిన్ సన్, సీ, ఫర్ ఆల్ మ్యాన్ కైండ్, ఎలిఫెంట్ క్యూన్ షోలను కూడా వీక్షించవచ్చు. అలెక్సా వాయిస్ రిమోట్ లేదా పెయిర్డ్ ఎకో డివైజ్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన ఫేవరేట్ షోలు, మూవీలు సులభంగా ఆపిల్ టీవీ నుంచి చూడవచ్చు.
నవంబర్ 1 నుంచి అమెజాన్ ఫైర్ స్టిక్ యూజర్లు.. అమెజాన్ డిజిటల్ అసిస్టెంట్, అలెక్సాలో నచ్చిన షోను సెర్చ్ చేసి వీక్షించవచ్చు. అలెక్సాలో వాచ్ డికిన్ సన్ అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు.. మీకు నచ్చిన వీడియో కంటెంట్ ప్రత్యక్షం అవుతుంది.
ప్రస్తుతానికి ఆపిల్ టీవీ యాప్ సర్వీసును యూనైటెడ్ స్టేట్స్, కెనడా, యూనైటెడ్ కింగ్ డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, ఇండియా వంటి దేశాల్లోని Amazon Fire TV Stick రెండో జనరేషన్, Fire TV Stick 4K వాడే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్ ఫైర్ టీవీ బేసిక్ ఎడిషన్ యజమానులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రెజిల్, ఐర్లాండ్, మెక్సికో సహా 50కి పైగా దేశాల్లో ఉన్నారు.