8న అలర్ట్ : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్‌లు బంద్

  • Published By: madhu ,Published On : January 7, 2019 / 05:09 AM IST
8న అలర్ట్ : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్‌లు బంద్

హైదరాబాద్ : ఆటోలు..క్యాబ్‌లలో ప్రయాణం చేస్తుంటారా ? అయితే మీరు 2019, జనవరి 8వ తేదీన ప్రయాణం చేయలేరు. ఎందుకంటే రోడ్లపై ఆటోలు, క్యాబ్‌లు తిరగవు. డిమాండ్లు పరిష్కరించాలంటూ వెహికల్స్ కు ‘బ్రేకు’లు వేయనున్నారు. ఎక్కడికక్కడనే వేలాదిగా వాహనాలు నిలిచిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది. దీనిని ఆటోలు..క్యాబ్ డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు తమ పొట్టకొట్టే విధంగా ఉందని..ఇప్పటికే నష్టాలు ఎదుర్కొంటుంటే ఈ బిల్లు వల్ల మరింత కష్టాల్లోకి వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోజుకు ఆ రోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో ఇబ్బంది పడుతుంటే.. చట్ట సవరణలతో మరింత భారం కానుందని అంటున్నారు.

వాహన ఇన్సూరెన్స్ ను 50శాతం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీఏ అధికారుల అవినీతిని అరికట్టాలని, ఇష్టానుసారం విధిస్తున్న చలానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు డ్రైవర్లు. ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2019, జనవరి 8న ఆటోలు, స్కూల్ బస్సులు, క్యాబ్‌ డ్రైవర్లు బంద్‌ పాటించనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. సవరణ బిల్లు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని భగ్గుమన్నారు. సామాన్యులపై ఎందుకింత కక్షతో వ్యవహరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు డ్రైవర్లు. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. డ్రైవర్ల హక్కుల కోసం ఉద్యమం తీవ్రం చేస్తాం అని కూడా హెచ్చరించారు.