అలర్ట్ : బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మె

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నకార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ జనవరి 8న, బుధవారం, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పలు బ్యాంకింగ్ సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబిఎ) ప్రకారం ఆరు బ్యాంకు సంఘాలు కూడా సమ్మెలో చేరనున్నాయి. ఆరు ఉద్యోగ సంఘాలు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐఎన్‌బీఈఎఫ్), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ),బ్యాంక్ కర్మాచారి సేన మహసంఘ్ (బీకేఎస్‌ఎం) సమ్మెలో పాల్గొనాలని నిర‍్ణయించాయి.
ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇచ్చింది. అలాగే సెంట్రల్, కోఆపరేటివ్, రీజినల్ గ్రామీణ , లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు కూడా ఈ సమ్మెలో చేరాలని నిర్ణయించాయి. దీంతో అధికారికంగా ఆ రోజు (జనవరి 8, బుధవారం) సాధారణ సెలవు దినం కానప్పటికీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడబోతోంది.
బ్యాంకింగ్ సేవలు, ముఖ్యంగా బ్యాంకు ఏటీఎం సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే, ఆన్‌లైన్ లావాదేవీలు ప్రభావితం కావు. మరోవైపు ఈ యూనియన్లలో ఉద్యోగుల సభ్యత్వం చాలా తక్కువ కాబట్టి బ్యాంకు కార్యకలాపాలపై సమ్మె ప్రభావం తక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ వెల్లడించింది. ఏది ఏమైనప్పటికీ బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దీనికి అనుగుణంగా బుధవారం జనవరి 8 చేసుకోవాల్సిన బ్యాంక్ పనులు మంగళవారంనాడే పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం మంచిది.