గ్రామీణ మహిళల కోసం ధాన్యలక్ష్మి పథకం

  • Published By: chvmurthy ,Published On : February 1, 2020 / 11:28 AM IST
గ్రామీణ మహిళల కోసం ధాన్యలక్ష్మి పథకం

Updated On : February 1, 2020 / 11:28 AM IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  శనివారం పార్ల మెంట్ లో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ లో రైతులకు, మహిళలకు పెద్ద పీట వేశారు. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకం తీసుకువచ్చారు.  గ్రామీణ మహిళలకు ఆర్థిక చేయూత నివ్వడానికి ధాన్యలక్ష్మి పేరుతో  కొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలు చెయ్యనున్నారు. స్వయం సహాయక గ్రూపుల ద్వారా మహిళలకు ఆర్థిక స్వాలంబన కలిగించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ధాన్యలక్ష్మి పధకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గోదాములను నిర్మిస్తారు. వాటి నిర్వహణను మహిళలకు అప్పగిస్తారు.  ఈ గోదాముల నిర్వహణకు కేంద్రం నుండి రుణాలు కూడా మంజూరు చేస్తారు. నాబార్డు, ముద్ర సంస్థల ద్వారా వీటికి రుణ సదుపాయం అందుతుంది.  రైతులు ఈ గోదాములలో తమ పంటలను నిల్వ చేసుకోవచ్చు. దీంతో రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు.

 

గోదాముల నిర్వహణ ద్వారా మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందని కేంద్రం పేర్కొంది. కేవలం గ్రామీణ ప్రాంతాల మహిళలు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ స్కీమ్‌లో చేరిన గ్రూప్‌లను ధాన్య లక్ష్మీ గ్రూప్స్ అని పిలుస్తారు. ఈ విలేజ్ స్టోరేజ్ స్కీమ్ ద్వారా మహిళలను మళ్లీ ధనలక్ష్మీలను చేయాలని కేంద్రం భావిస్తోంది.  ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం  చేసే యోచనలో కేంద్రం ఉంది.   రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్‌హెచ్‌జీలకు సాయం చెయ్యనున్నారు. అంతేకాక నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్‌ యోజన, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రవాణా సదుపాయం ఇస్తున్నారు. కిసాన్‌ రైల్వే, కిసాన్‌ ఉడాన్‌ యోజన పథకాలు అమలు చెయ్యనున్నారు. కూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతులు, రవాణాకు ప్రత్యేక విమానాల వినియోగం చెయ్యనున్నారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధులను కేటాయిస్తున్నారు. అంతే కాదు ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇలా గ్రామీణ మహిళలకు, రైతులకు పెద్ద పీట వేశారు.