రేపు బ్యాంకుల సీఈవోలతో నిర్మలా సీతారామన్ భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం,డిసెంబర్28న ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు, పనితీరు, వ్యాపారంలో వృద్ధి తదితర వివరాలను తెలుసుకోవడానికి నిర్మలా ఆయా బ్యాంకుల అధిపతులతో సమావేశంకాబోతున్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ కంటే ముందు ఈ సమావేశం జరుగుతుండటం విశేషం. ఈ సమావేశానికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎండీ, సీఈవోలు హాజరుకాబోతున్నారు.
ఈ సమావేశంలో బ్యాంకుల్లో పేరుకు పోయిన మొండి బకాయిల వసూళ్లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, అలాగే దివాలా చట్టం కింద ఎన్ని కేసులు పరిష్కరించిన దానిపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తున్నది.
గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.4,01,393 కోట్లు రికవరీ చేశాయి. 2018-19 ఆర్థిక సంవత్స రంలో రికార్డు స్థాయిలో రూ.1,56,702 కోట్లు రికవరీ చేయడం విశేషం. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో భారత వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠ స్థాయి 4.5 శాతానికి పడిపోగా, భవిష్యత్తులోనూ మరింత పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.