బంగారం కొనుగోళ్లు తగ్గాయని లబోదిబోమంటున్న వ్యాపారులు.. ఎందుకంటే? ఇప్పుడు కొంటే మీ పరిస్థితి..

వాయిదా కొనుగోలు పథకాలు అంటే.. వినియోగదారులు ముందుగా తక్కువగా, విడతలుగా చెల్లింపులు చేస్తారు. దానికిగాను రాయితీలు ఉంటాయి. రిలయన్స్‌ కి జూలై నాటికి 1,68,000 మంది డిపాజిటర్లు ఉన్నారు.

బంగారం కొనుగోళ్లు తగ్గాయని లబోదిబోమంటున్న వ్యాపారులు.. ఎందుకంటే? ఇప్పుడు కొంటే మీ పరిస్థితి..

Gold Price

Updated On : October 14, 2025 / 7:37 PM IST

Gold demand dips: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ పండుగ సీజన్‌లో పసిడి డిమాండ్ తగ్గింది. కొవిడ్‌ మహమ్మారి ప్రబలిన సమయంలో తప్ప గత 10 ఏళ్లలో ఎన్నడూలేనంతగా ఇప్పుడు టాటా సంస్థకు చెందిన తనిష్క్‌, రిలయన్స్‌ రిటైల్‌లో వాయిదా పద్ధతి గోల్డ్‌ స్కీమ్‌లో వినియోగదారుల డిపాజిట్లు తగ్గాయి. పసిడి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో కొనుగోళ్లు తగ్గుతున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

రిలయన్స్‌ రిటైల్‌ వార్షిక నివేదిక ప్రకారం.. ఈ పథకం కింద డిపాజిట్లు 5% తగ్గి రూ.333 కోట్లకు చేరాయి. ఇది బంగారం కొనుగోళ్లు తగ్గిన అంశానికి సంకేతమని అధికారులు పేర్కొన్నారు. టైటాన్‌ నివేదిక ప్రకారం.. తనిష్క్‌ ద్వారా బంగారం ఆభరణాల కొనుగోలుకు చేసిన నికర డిపాజిట్లు గత ఏడాదితో పోలిస్తే 19% తగ్గి రూ.3,458 కోట్లుగా నమోదయ్యాయి. బంగారం ధర 10 గ్రాములకు రూ.1.22 లక్షలు దాటడంతో ఆర్థిక ఏడాది 2026లో కూడా ఈ పథకాల డిపాజిట్లు మరింత తగ్గవచ్చని అంచనా.

Also Read: బంగారం ధరలు ఆకాశాన్నంటనున్నాయా? ఈ ధనత్రయోదశికి మీ జేబుకు చిల్లు పడుతుందా? నిపుణుల సూచన ఇదే..

“ఈ పథకం ద్వారా జరిగే కొనుగోళ్లు ఈ ఏడాది తగ్గాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో ఇలా జరగడం సాధారణం” అని సెంకో గోల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సువంకర్‌ సేన్‌ అన్నారు. 2024 క్యాలెండర్‌ సంవత్సరంలో బంగారం ధరలు 23% పెరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి పసిడి ధరలు గత ఏడాదితో పోలిస్తే 56% పెరిగాయి.

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (WGC) భారత్‌కు సంబంధించిన వార్షిక వినియోగ అంచనాను 200 టన్నుల వరకు తగ్గించింది. 2024లో దేశం మొత్తం 802 టన్నుల బంగారం వినియోగించింది. 2025లో ఈ వినియోగం 600-700 టన్నుల మధ్య ఉండవచ్చని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ పేర్కొంది.

వాయిదా కొనుగోలు పథకాలు అంటే.. వినియోగదారులు ముందుగా తక్కువగా, విడతలుగా చెల్లింపులు చేస్తారు. దానికిగాను రాయితీలు ఉంటాయి. రిలయన్స్‌ కి జూలై నాటికి 1,68,000 మంది డిపాజిటర్లు ఉన్నారు. సెంకో తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాపారం దాదాపు 40% ఈ పథకాల నుంచే ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా రూ.500 కోట్ల వరకు సమీకరించాలనుకుంటున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ సెప్టెంబర్‌ 30 నోటీసులో తెలిపింది. అయితే, ఏప్రిల్‌-జూలై మధ్య డిపాజిట్లు గత ఏడాదితో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. జూలై 16 నాటికి మొత్తం డిపాజిట్లు (క్లెయిమ్‌ చేయని మొత్తాలు సహా) రూ.349 కోట్లు కాగా, మార్చి 31 నాటికి అవి రూ.352 కోట్లు ఉన్నాయి.