బంగారం ధరలు ఆకాశాన్నంటనున్నాయా? ఈ ధనత్రయోదశికి మీ జేబుకు చిల్లు పడుతుందా? నిపుణుల సూచన ఇదే..

సీజనల్ డిమాండ్, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, రూపాయి బలహీనత, అధిక దిగుమతి పన్నులు భారత్‌లో బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

బంగారం ధరలు ఆకాశాన్నంటనున్నాయా? ఈ ధనత్రయోదశికి మీ జేబుకు చిల్లు పడుతుందా? నిపుణుల సూచన ఇదే..

Updated On : October 14, 2025 / 4:11 PM IST

Gold Rate Outlook: బంగారం దూకుడుకు బ్రేకుల్లేకుండా పోతున్నాయ్. 2025లో పసిడి 50% పైగా ఎగబాకింది. ఇది 2022తో పోలిస్తే ఏకంగా 140% పెరుగుదల. ఈ ధనత్రయోదశికి కొత్త రికార్డు ధరలు ఖాయమా? నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుందాం..

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్య విధాన మార్పులు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు, వడ్డీ రేట్ల కోత అంచనాలు బంగారానికి మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. ఫియట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం కూడా దీనికి ఒక కారణం.

ధనత్రయోదశికి పసిడి పరిస్థితి?

నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ధనత్రయోదశికి 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,000 – 1,30,000 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఔన్సుకు $4,150 – $4,250 లక్ష్యంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2026 ప్రారంభంలో రూ.1,50,000 మార్కును కూడా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఈ పరిస్థితి కరెన్సీ సంక్షోభం లేదా తీవ్రమైన భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అనూహ్య పరిస్థితులు ఏర్పడితేనే వస్తాయని కూడా అంటున్నారు. వాస్తవిక ధర పరిధి రూ.1,26,000 – 1,28,000గా ఉండవచ్చని అంచనా.

ఎందుకు ఈ పెరుగుదల? కీలక కారణాలు ఇవే

ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు: గ్లోబల్ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ కోతలు: వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు బంగారానికి లాభాన్నిస్తాయి.

బలహీనమైన యూఎస్ డాలర్: డాలర్ బలహీనపడటం వల్ల ఇతర కరెన్సీల్లో బంగారం చౌకగా లభించి, డిమాండ్‌ను పెంచుతుంది.

సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు: దేశాలు యూఎస్ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇది పసిడి ధరలకు పెద్ద ఊతం.

ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు: ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నందున పెట్టుబడిదారులు బంగారంతో కూడిన ఈటీఎఫ్‌లలో భద్రతను చూస్తున్నారు. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్ ప్రకారం.. భారతీయ బంగారం ఈటీఎఫ్‌లలో భారీ ఇన్‌ఫ్లో నమోదైంది.

భారతదేశంలో ప్రత్యేక డిమాండ్

సీజనల్ డిమాండ్, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, రూపాయి బలహీనత, అధిక దిగుమతి పన్నులు భారత్‌లో బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీర్ఘకాలంలో బంగారం ఆధారిత పెట్టుబడి పరికరాలవైపు మళ్లడం కూడా ధరలకు మద్దతు ఇస్తుంది.

సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గడం, ద్రవ్యోల్బణం కొనసాగడం వంటివి బంగారం రేట్లను 2026లో మరింత పెంచేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ విధానాలు, భౌగోళిక ప్రమాదాలు, కరెన్సీ మార్పులు బంగారం దిశను నిర్ణయిస్తాయి.