Gold Rate: వామ్మో.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సరికొత్త రికార్డులు నమోదు.. ఇక గోల్డ్ కొనలేమా..!
బంగారం రేటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని, ఊహించని విధంగా గోల్డ్ రేటు పెరుగుతోంది.

Gold
Gold Rate: రానున్నరోజుల్లో సామాన్యులు బంగారం కొనలేరా..? తులం గోల్డ్ రేటు రూ.లక్షన్నర దాటేస్తుందా.. ఇప్పటికే 10గ్రాముల బంగారం ధర రూ.లక్షకు చేరువకాగా.. మరో ఐదారు నెలల్లో రూ.లక్షన్నర దాటేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇందుకు ప్రధాన కారణాలు ఉన్నాయి.
బంగారం రేటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని, ఊహించని విధంగా గోల్డ్ రేటు పెరుగుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10గ్రాముల) మేలిమి బంగారం ధర బుధవారం రాత్రి 3,330 డాలర్లకు చేరింది. పుత్తడి ధర 3,300 డాలర్లను తాకడం చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా దేశీయ విపణిలోనూ బంగారం ధర భగ్గుమంది.
హైదరాబాద్ లో బులియన్ విపణిలో బుధవారం రాత్రి 11.30గంటల సమయానికి 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.98,400కి చేరింది. కిలో వెండి ధర రూ. 98,900 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ కమొడిటీ ఎక్స్ఛేంచ్ ఎంసీఎక్స్ లో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు గరిష్ఠంగా రూ.95,732కు చేరింది. అయితే, చివరకు రూ.93,451 వద్ద ముగిసింది.
పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరికొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బంగారం ధర ఇదే రీతిలో పెరుగుతూ పోతే రాబోయే ఐదారు నెలల్లో రూ.లక్షన్నరకు చేరడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక ఉద్రిక్తతలు, అమెరికా, చైనా మధ్య అంతకంతకూ పెరుగుతున్న టారిఫ్ యుద్ధం కారణంగా గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అధిక సుంకాలు, వస్తువులు, ఖనిజాల ఎగమతులపై ఆంక్షల ఫలితంగా అమెరికాలో టెక్ కంపెనీల షేర్లు, ప్రధాన సూచీలు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా డాలర్ సూచీ 100 కంటే దిగువకు చేరడంతో సురక్షితమని భావించి బంగారం, వెండిపైకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. మరోవైపు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తారనే అంచనాలూ బంగారం ధర పెరిగేందుకు దోహదం పడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.